ఇరాన్‌ : వారికి హలో.. గుడ్‌బై.. సంతాపం..!!

Iran Kimia Alizadeh Player Olympic Medalist Decided To Quit Country - Sakshi

టెహ్రాన్‌ : ఇరాన్‌కు ఒలింపిక్‌ పతకాన్ని అందించిన మొదటి, ఏకైక మహిళా క్రీడాకారిణి కిమియా అలీజాడే తమ దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్‌లో క్రీడాకారులపై.. ముఖ్యంగా మహిళా క్రీడాకారులపై జరుగుతున్న వేధింపుల పర్వాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లకు సైతం కనీస గౌరవం ఉండదని వాపోయారు. అందుకనే దేశాన్ని విడిచి యూరప్‌ వచ్చినట్టు స్పష్టం చేశారు. యూరప్‌నకు తననెవరూ ఆహ్వానించలేదని.. తానే వచ్చానని తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో అలీజాడే తైక్వాండోలో కాంస్య పతకం సాధించారు. 57 కేజీల కేటగిరీలో ఆమె ఈ పతకం సాధించారు. 
(చదవండి : పొరపాటున కూల్చేశాం)

‘దేశం విడిచి వస్తున్నప్పుడు చాలా బాధపడ్డా. కానీ, వంచన, అన్యాయానికి గురవుతూ.. అబద్ధాలు, పొగడ్తలు ప్రకటిస్తూ బతకలేను. పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచితే.. దానిని రాజకీయాల కోసం కొందరు వాడుకుంటారు. వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అధికారులు.. మహిళలు తైక్వాండో లాంటి ఆటలు ఆడరాదు అని నీచంగా మాట్లాడతారు. మా కష్టాన్ని గుర్తించకపోగా.. అవమానిస్తారు. వంచనకు గురవుతున్న ఎందరో క్రీడాకారిణుల్లో నేనొరిని. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలతో మాకు ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు.  మమ్మల్ని కేవలం వస్తువులుగానే చూస్తారు. అయినా, వారి ఆదేశాల్ని పాటించా. దేశంలో పీడనకు గురయ్యే వారికి హలో..! ‘ఉన్నత స్థానం’ లో ఉన్నవారికి గుడ్‌బై, తమవారిని కోల్పోయి శోకంలో ఉన్నవారికి సంతాపాన్ని తెలుపుతున్నా’అని అలీజాడే పేర్కొన్నారు.
(చదవండి : ‘భారత్‌ ముందుకొస్తే స్వాగతిస్తాం’!)

కాగా, అలీజాడే నిర్ణయంపై ఇరాన్‌ క్రీడాశాఖ సహాయ మంత్రి మహిన్‌ ఫర్హాదిజాడే మాట్లాడుతూ.. ‘అలీజాడే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు చూడలేదు. అయితే, ఆమె విదేశాల్లో ఫిజియోథెరఫీ చదవాలనుకునేది. బహుశా అదే కారణం కావొచ్చు’అన్నారు. ఇక ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసీం సులేమానీ హత్యతో మొదలైన ఉద్రిక్తలు అంతకంతకూ తీవ్రమైన సంగతి తెలిసిందే. సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట జరగడంతో 56 మంది మరణించగా..  ఉక్రెయిన్‌ విమానాన్ని ఇరాన్‌ మిలటరీ కూల్చడంతో మరో 176 మంది మరణించారు. ఇప్పటికే.. చెస్‌ ఆటగాడు అలీరెజా ఫిరౌజా ఇరాన్‌ తరపున ఆడనని చెప్పగా.. జూడో ఆటగాడు సయీద్‌ మొలాయి దేశ విడిచి వెళ్లడం గమనార్హం.
(చదవండి : ట్రంప్‌నకు ఇరాన్‌ గట్టి కౌంటర్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top