
ఐపీఎల్-7 వేదికలపై వీడని అనిశ్చితి
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2014 పోటీల వేదికలపై అనిశ్చితి కొనసాగుతోంది.
ముంబై: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2014 పోటీల వేదికలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఐపీఎల్ ఏడో అంచెను పూర్తిగా భారత్లోనే నిర్వహిస్తారా లేక వేదికల్ని దక్షిణాఫ్రికాకు తరలిస్తారా అన్న విషయంపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత ఐపీఎల్ వేదికపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెప్పారు. శుక్రవారం జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో లీగ్ వేదికలు, నిర్వహణ గురించి చర్చించారు.
ఐపీఎల్ పోటీలు ఏప్రిల్ 9-జూన్ 3 మధ్య జరగనున్నాయి. అదే సమయంలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్కు భద్రత కల్పించడం సాధ్యంకాదని కేంద్ర హోం మంత్రత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. 2009లోనూ లీగ్కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన దృష్ట్యా ఐపీఎల్ వేదికను దక్షిణాప్రికాకు తరలించారు. తాజా పోటీలను కూడా దక్షిణాప్రికాలో నిర్వహించి ప్లే ఆఫ్ మ్యాచ్లను భారత్లో జరపాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో కొన్ని కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఐపీఎల్కు అనుమతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. లీగ్ను విదేశాల్లో నిర్వహించడం వల్ల ఆదాయానికి భారీగా గండి పడే అవకాశముంది.