
‘రైజింగ్’ మొదలైంది!
ఐపీఎల్‌లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ దిట్ట. కానీ భారీ స్కోర్ల విషయంలో మాత్రం కాదు. గతంలో ఈ జట్టు 150 పైచిలుకు స్కోర్లు చేసిన మూడుసార్లూ ఓడిపోయింది. ఈసారి కూడా భారీస్కోరు సాధించినా సన్‌రైజర్స్ తడబడింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణి
4 పరుగులతో ఢిల్లీపై విజయం
ఫించ్, వార్నర్ మెరుపులు
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన తర్వాత... సన్‌రైజర్స్ జట్టు తేరుకుంది. జట్టు ప్రధాన బలం టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తొలిసారి చెలరేగిపోవడంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్-7లో బోణీ చేసింది. మరోవైపు పీటర్సన్ బరిలోకి దిగినా ఢిల్లీ ఆటతీరు ఇంకా గాడిలో పడలేదు.
దుబాయ్: ఐపీఎల్‌లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ దిట్ట. కానీ భారీ స్కోర్ల విషయంలో మాత్రం కాదు. గతంలో ఈ జట్టు 150 పైచిలుకు స్కోర్లు చేసిన మూడుసార్లూ ఓడిపోయింది. ఈసారి కూడా భారీస్కోరు సాధించినా సన్‌రైజర్స్ తడబడింది.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ పోరాటంతో ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. శుక్రవారం దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. 20 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 184 పరుగుల భారీస్కోరు సాధించింది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 88 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, కెప్టెన్ ధావన్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు మురళీ విజయ్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టెయిన్ రెండు వికెట్లు తీశాడు.
భారీ భాగస్వామ్యం
తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు ధావన్, ఫించ్ ధాటిగా ఆడి శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో హైదరాబాద్ 55 పరుగులు చేసింది. అయితే కొద్ది సేపటికే నదీమ్ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరగడంతో 56 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అదే ఓవర్లో సున్నా వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కార్తీక్ వదిలేశాడు.
మధ్య ఓవర్లలో ఫించ్, వార్నర్ నెమ్మదిగాఆడారు. దీంతో 7-14 ఓవర్ల మధ్య కేవలం 44 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత స్లాగ్ ఓవర్లలో ఇద్దరూ చెలరేగారు. చివరి 6 ఓవర్లలో సన్‌రైజర్స్ 85 పరుగులు చేసింది. ఫించ్, వార్నర్ 82 బంతుల్లోనే అభేద్యంగా 128 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో ఆ జట్టు ఆడిన 20 మ్యాచుల్లో ఇదే (184) అత్యధిక స్కోరు కావడం విశేషం.
విజయ్, డి కాక్ శుభారంభం
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ కూడా జోరుగా సాగింది. డి కాక్, విజయ్ తొలి వికెట్‌కు 99 పరుగులు జత చేశారు. కానీ 4 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ అవుటయ్యారు. పీటర్సన్ (16), కార్తీక్ (15) ఓ మాదిరిగా ఆడినా.. . స్టెయిన్ ఈ ఇద్దరినీ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. విజయానికి చివరి మూడు ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో... డుమిని (7 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తివారి (13 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. 2 ఓవర్లలో 29 పరుగులు చేశారు. భువనేశ్వర్ వేసిన ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేసినా... ఓటమి తప్పలేదు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) నదీమ్ 33; ఫించ్ (నాటౌట్) 88; వార్నర్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 184.
వికెట్ల పతనం: 1-56; బౌలింగ్: నదీమ్ 4-0-24-1; షమీ 4-0-36-0; పార్నెల్ 4-0-38-0; ఉనాద్కట్ 4-0-43-0; డుమిని 2-0-19-0; శుక్లా 2-0-21-0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఫించ్ (బి) కరణ్ 48; విజయ్ (సి) స్టెయిన్ (బి) స్యామీ 52; పీటర్సన్ (సి) స్యామీ (బి) స్టెయిన్ 16; కార్తీక్ (సి) రాహుల్ (బి) స్టెయిన్ 15; డుమిని (నాటౌట్) 20; తివారి (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 180.
వికెట్ల పతనం: 1-99; 2-103; 3-135; 4-135.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-40-0; స్టెయిన్ 4-0-33-2; వేణు 1-0-9-0; కరణ్ 4-0-23-1; స్యామీ 3-0-34-1; మిశ్రా 4-0-38-0.