ఐపీఎల్ ఏడో అంచెలో రాజస్థాన్ రాయల్స్ పది పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ ఏడో అంచెలో రాజస్థాన్ రాయల్స్ పది పరుగులతో కోల్కతా నైట్ రైడర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారమిక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. కోల్కతా ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (65), గంభీర్ (54) హాఫ్ సెంచరీలతో రాణించి విజయానికి బాటలు వేశారు. దీంతో 14 ఓవర్లలో స్కోరు 121 పరుగులకు చేరుకుంది. దీంతో కోల్కతా విజయం ఖాయమనిపించింది. కాగా ఆ మరుసటి ఓవర్లో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. షేన్ వాట్సన్ 15వ ఓవర్లో గంభీర్, ఊతప్ప, రసెల్ను అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో ప్రవీణ్ టంబె హ్యాట్రిక్ వికెట్తో కోల్కతాను చావు దెబ్బతీశాడు. మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, టెన్ డష్కాటేను పెవిలియన్ చేర్చాడు. దీంతో కోల్ కతా రెండు పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది. ఆనక షకీబల్, సూర్యకుమార్ యాదవ్ పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
అంతకుముందు రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (30), కరుణ్ నాయర్ (44) జట్టుకు శుభారంభం అందించారు. సంజు శామ్సన్ (37), షేన్ వాట్సన్ (31) ఇదే జోరు కొనసాగించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగలిగింది. కోల్కతా బౌలర్లు సునీల్ నరైన్, వినయ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు.