షరా మామూలే... | IPL 7: Mumbai Indians’ miserable run continues | Sakshi
Sakshi News home page

షరా మామూలే...

Apr 28 2014 1:23 AM | Updated on Sep 2 2017 6:36 AM

షరా మామూలే...

షరా మామూలే...

ఐపీఎల్-7లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆల్‌రౌండ్ వైఫల్యం కారణంగా ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో చిత్తయింది.

నాలుగో మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి    
 ఆరు వికెట్లతో గెలిచిన ఢిల్లీ
 
 డిఫెండింగ్ చాంపియన్ హోదా... బలమైన జట్టు... పరుగుల వరద పారించే బ్యాట్స్‌మెన్... ప్రత్యర్థులను వణికించే బౌలర్లు... ఒక జట్టు విజయం సాధించేందుకు ఇంతకన్నా ఏం కావాలి... అయితే అన్నీ ఉన్నా ముంబై ఇండియన్స్ మాత్రం ఐపీఎల్-7లో ఘోరంగా విఫలమవుతోంది. తాజాగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలోనూ ఓడిపోయి వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.
 
 షార్జా: ఐపీఎల్-7లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆల్‌రౌండ్ వైఫల్యం కారణంగా ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో చిత్తయింది. ఆదివారం షార్జాలో జరిగిన లీగ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా... కీరన్ పొలార్డ్ (30 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గౌతమ్ (18 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ విజయ్ (34 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ పీటర్సన్ (18 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. విజయ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
 
   బ్యాట్స్‌మెన్ వైఫల్యం
 భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ, తారే వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 17 పరుగులకే ఓపెనర్లు వెనుదిరగడంతో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. దీన్ని ఢిల్లీ బౌలర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఉనాద్కట్ బౌలింగ్‌లో అండర్సన్, ైమైక్ హస్సీ నిష్ర్కమించగా... అంబటి రాయుడుని నదీమ్ అవుట్ చేశాడు.
 
 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో కీరన్ పొలార్డ్, చిదంబరం గౌతమ్ జట్టుకి అండగా నిలిచారు. సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును వంద దాటించారు. గౌతమ్ రనౌటైన తర్వాత పొలార్డ్, హర్భజన్ ధాటిగా ఆడారు. ఇద్దరు చెరో ఫోర్, చెరో సిక్సర్ బాదారు. దీంతో ముంబై స్కోరు 125కి చేరుకుంది. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు వచ్చాయి.
 
 రాణించిన విజయ్
 ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడంలో ఓపెనర్లు డి కాక్, మురళీ విజయ్ ఇబ్బంది పడ్డారు. దీంతో పవర్ ప్లేలో ఢిల్లీకి 31 పరుగులు మాత్రమే వచ్చాయి.
 
 ఏడో ఓవర్‌లో డి కాక్ అవుటైన తర్వాత విజయ్ స్పీడ్‌గా ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న డుమిని నిదానంగా బ్యాటింగ్ చేశాడు. అయితే రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించిన తర్వాత విజయ్ అవుటయ్యాడు. ఈ సమయంలో చేయాల్సిన పరుగుల కన్నా బంతులు తక్కువగా ఉన్నాయి. అయితే కెప్టెన్ పీటర్సన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ మలింగ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో డుమిని, దినేశ్ కార్తీక్ వెంటవెంటనే అవుటవడంతో మళ్లీ టెన్షన్ పెరిగింది.
 అయితే పీటర్సన్, కేదార్ జాదవ్ ముంబై బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఆడారు. చకచకా పరుగులు తీసి మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.
 
 స్కోరు వివరాలు
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 4; తారే (సి) డి కాక్ (బి) పార్నెల్ 8; అండర్సన్ (సి) డి కాక్ (బి) ఉనాద్కట్ 13; రాయుడు (సి) శుక్లా (బి) నదీమ్ 14; మైక్ హస్సీ (బి) ఉనాద్కట్ 10; పొలార్డ్ నాటౌట్ 33; గౌతమ్ రనౌట్ 22; హర్భజన్ రిటైర్డ్‌హర్ట్ 10; జహీర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 125
 వికెట్ల పతనం: 1-10; 2-17; 3-39; 4-46; 5-63; 6-103
 బౌలింగ్: నదీమ్ 4-0-19-1; షమీ 4-0-36-0; డుమిని 3-0-13-0; పార్నెల్ 4-0-17-1; ఉనాద్కట్ 4-0-29-2; శుక్లా 1-0-5-0.
 
 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) హస్సీ (బి) అండర్సన్ 16; విజయ్ (బి) రోహిత్ 40; డుమిని (సి) అపూర్వ్ (సబ్) (బి) మలింగ 19; పీటర్సన్ నాటౌట్ 26; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) మలింగ 2; కేదార్ జాదవ్ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 126
 వికెట్ల పతనం: 1-34; 2-79; 3-103; 4-105.
 బౌలింగ్: మలింగ 4-0-17-2; ప్రజ్ఞాన్ ఓజా 4-0-26-0; జహీర్ 2.5-0-17-0; హర్భజన్ 4-1-23-0; అండర్సన్ 2-0-16-1; రోహిత్ 2-0-20-1.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement