బెంగళూరు గెలిచిందోచ్‌..

IPL 2019 RCB Register First Win beat Punjab By 8 Wickets - Sakshi

పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం

క్రిస్‌గేల్‌ ఒంటరి పోరాటం వృథా​

మొహాలి: హమ్మయ్య.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో డీలా పడిన ఆర్సీబీ ఎట్టకేలకు గెలుపు రుచిని చూసింది. శనివారం స్థానిక ఐఎస్‌ బింద్రా మైదానంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో తొలిసారి సమిష్టిగా ఆడిన కోహ్లి సేన అపూర్వ విజయాన్ని అందుకుంది. కింగ్స్‌ పంజాబ్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని.. 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సారథి విరాట్‌ కోహ్లి(67;53 బంతుల్లో 8ఫోర్లు), డివిలియర్స్‌(59 నాటౌట్‌; 38 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు బాధ్యతాయుతంగా ఆడగా.. చివర్లో స్టొయినిస్‌(28నాటౌట్‌; 16 బంతుల్లో 4ఫోర్లు) రాణించాడు. పంజాబ్‌ బౌలర్లలో షమీ, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తలో వికెట్‌ సాధించారు. 

అంతకుముందు పంజాబ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌(99 నాటౌట్‌; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కింగ్స్‌ పంజాబ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-క్రిస్‌ గేల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌(18) ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న రాహుల్‌ను చహల్‌ పెవిలియన్‌కు పంపాడు. అయితే మయాంక్‌ అగర్వాల్‌(15),సర్ఫరాజ్‌ ఖాన్‌(15)లు నిరాశపరిచారు. కాగా, గేల్‌ ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరును చక్కదిద్దాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చహల్‌ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్‌, మొయిన్‌ అలీలు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top