సన్‌పోరు సమాప్తం

IPL 2019 Eliminator Match Delhi Beat Sunrisers By 2 Wickets - Sakshi

ఎలిమినేటర్‌లో ఓడిన హైదరాబాద్‌

ఢిల్లీని గెలిపించిన పంత్, పృథ్వీ షా

రేపు చెన్నైతో రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ ఢీ  

అతి తక్కువ పాయింట్లతో ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్‌ చేరిన జట్టుగా గుర్తింపు పొందిన సన్‌రైజర్స్‌ ఆట అంతటితోనే ముగిసింది. లీగ్‌లో కొనసాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసక్తికరంగా, అనూహ్య మలుపులతో సాగిన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్‌లో అంతంత మాత్రం ప్రదర్శనతో సాధారణ స్కోరు నమోదు చేసిన రైజర్స్‌ బౌలింగ్‌లో మాత్రం ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. కానీ రిషభ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆట గమనాన్ని మార్చేసింది. చివరకు మరో బంతి మిగిలి ఉండగా విజయాన్ని అందుకొని ఢిల్లీ సంబరాలు చేసుకుంది. గత ఏడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ ఈసారి నాలుగో స్థానానికి పరిమితం కాగా... 2012 తర్వాత ప్లే ఆఫ్‌ చేరి ఎలిమినేటర్‌లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టే లక్ష్యంతో రేపు వైజాగ్‌లోనే చెన్నైతో పోరు సిద్ధమైంది.   

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఐపీఎల్‌–12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట ముగిసింది. బుధవారం ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (19 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు), మనీశ్‌ పాండే (36 బంతుల్లో 30; 3 ఫోర్లు), కెప్టెన్‌ విలియమ్సన్‌ (27 బంతుల్లో 28; 2 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా అమిత్‌ మిశ్రా (1/16) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయగా, కీమో పాల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిషభ్‌ పంత్‌ (21 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌ క్యాపిటల్స్‌ను గెలిపించాయి.   

అంతంత మాత్రమే... 
సీజన్‌లో మూడో మ్యాచ్‌ మాత్రమే ఆడుతున్న గప్టిల్‌ కీలక పోరులో రైజర్స్‌కు కావాల్సిన శుభారంభాన్ని అందించాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన గప్టిల్, బౌల్ట్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో మరో రెండు భారీ సిక్సర్లతో జోరు ప్రదర్శించాడు. మరోవైపు బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా ‘రివ్యూ’ కోరి సానుకూల ఫలితం పొందిన వృద్ధిమాన్‌ సాహా (8) ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత మిశ్రా తన తొలి ఓవర్లోనే గప్టిల్‌ను ఔట్‌ చేయడంతో ఒక్కసారిగా స్కోరు వేగం తగ్గింది. 5 పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ వదిలేశాడు. ఈ దశలో పాండే, విలియమ్సన్‌ ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు. వరుసగా నాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. వీరిద్దరు మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించినా... 42 బంతులు తీసుకున్నారు. పాండేను ఔట్‌ చేసి పాల్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, ఇషాంత్‌ చక్కటి యార్కర్‌తో విలియమ్సన్‌ను బౌల్డ్‌ చేశాడు. అయితే చివర్లో విజయ్‌ శంకర్, నబీ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు హైదరాబాద్‌కు మెరుగైన స్కోరు అందించాయి. బౌల్ట్‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన శంకర్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. పాల్‌ వేసిన 20వ ఓవర్లో రైజర్స్‌ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయినా... ఆఖరి ఐదు ఓవర్లలో కలిపి 58 పరుగులు చేయగలిగింది.  

షా సూపర్‌... 
ఛేదనలో యువ పృథ్వీ షా అదిరే ఆటను ప్రదర్శించడంతో ఢిల్లీ దూసుకుపోయింది. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో శిఖర్‌ ధావన్‌ (16 బంతుల్లో 17; 3 ఫోర్లు) రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టగా, షా దానిని కొనసాగించాడు. ఖలీల్‌ తొలి ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగిన అతను, భువీ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో వరుస బంతుల్లో షా 4, 6, 4 బాదడం విశేషం. అంతకుముందు 15 పరుగుల వద్ద నబీ బౌలింగ్‌లో తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మిడాఫ్‌లో బాసిల్‌ థంపి వదిలేయడంతో బతికిపోయిన షా ఆ ‘లైఫ్‌’ను సమర్థంగా వాడుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 55 పరుగులకు చేరగా తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని దీపక్‌ హుడా విడదీశాడు. హుడా వేసిన వైడ్‌ బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడబోయిన ధావన్‌... సాహా అద్భుత ప్రదర్శనకు స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 31 బంతుల్లో పృథ్వీ అర్ధ సెంచరీ పూర్తి కాగా... మరో ఎండ్‌లో కెప్టెన్‌ అయ్యర్‌ (10 బంతుల్లో 8; ఫోర్‌) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయ్యర్‌తో పాటు షార్ట్‌ బంతితో అదే ఓవర్లో పృథ్వీని కూడా ఔట్‌ చేసి ఖలీల్‌ అహ్మద్‌ ఒక్కసారిగా రైజర్స్‌ శిబిరంలో ఆశలు రేపాడు. ఆ తర్వాత 15వ ఓవర్‌ను అద్భుతంగా ‘మెయిడిన్‌’ వేసిన రషీద్‌ ఖాన్‌... మున్రో (13 బంతుల్లో 14; ఫోర్, సిక్స్‌), అక్షర్‌ (0)లను ఔట్‌ చేయడంతో అనూహ్యంగా మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ వైపు మొగ్గింది. అయితే పంత్‌ విధ్వంసం హైదరాబాద్‌ను ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించేలా చేసింది.  

చివర్లో ఉత్కంఠ... 
జట్టును విజయానికి అతి చేరువగా తెచ్చిన పంత్‌ మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అవసరం లేకపోయినా భువనేశ్వర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగిపోయింది. 8 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా పంత్‌ వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 5 పరుగులు అవసరంకాగా... నాలుగో బంతికి పరుగు తీసే ప్రయత్నంలో మిశ్రా... బౌలర్‌ ఖలీల్‌ త్రోకు అడ్డుగా రావడంతో ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ రూపంలో వెనుదిరిగాడు. 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండటంతో రైజర్స్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఐదో బంతిని కీమో పాల్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా ఫోర్‌ కొట్టడంతో క్యాపిటల్స్‌ బృందం ఊపిరి పీల్చుకుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top