
సాకర్ సంబరానికి వేళాయె!
ఐపీఎల్, ప్రొ కబడ్డీ లీగ్ అనంతరం భారత క్రీడాభిమానులను అలరించేందుకు నేటి నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) సందడి చేయనుంది.
గువాహటి: ఐపీఎల్, ప్రొ కబడ్డీ లీగ్ అనంతరం భారత క్రీడాభిమానులను అలరించేందుకు నేటి నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) సందడి చేయనుంది. దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు ఆదరణ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఐఎస్‌ఎల్‌కు ఇది మూడో సీజన్. ఇందులో పాల్గొనే ఎనిమిది జట్లు తలా 14 మ్యాచ్‌లను ఆడనుండగా.. 11 వారాల పాటు సాగే ఈ లీగ్ ఫుట్‌బాల్ ప్రేమికులను అలరించనుంది. చెన్నైయిన్ ఎఫ్‌సీ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది.
ప్రారంభ మ్యాచ్ నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య జరగనుంది. గత రెండు సీజన్లలోనూ ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరిగింది. తొలి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కేరళ బ్లాస్టర్స్ ఈ సారి కొత్త యాజమాన్యం అధ్వర్యంలో విజేతగా నిలవాలని భావిస్తోంది. సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రముఖ తెలుగు నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఈ జట్టులో భాగస్వామ్యులు.
మ్యాచ్‌కు ముందే శనివారం సాయంత్రం ఐఎస్‌ఎల్ ఆరంభ వేడుకలను జరపనున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ తమ నృత్యాలతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. యువ నటి ఆలియా భట్, జాక్విలిన్ ఫెర్నాండెజ్‌తో పాటు వరుణ్ ధావన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు.