అదిరే ఆరంభంతో... | Sakshi
Sakshi News home page

అదిరే ఆరంభంతో...

Published Sat, Feb 22 2020 1:31 AM

India Women Cricket Team Won Against Australia In ICC T20 World Cup - Sakshi

పూనమ్‌ యాదవ్‌ లెగ్‌ స్పిన్‌ ఉచ్చు కంగారూ మెడకు బలంగా బిగుసుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చేష్టలుడిగి తలవంచితే... భారత్‌ ఘనవిజయంతో టి20 ప్రపంచకప్‌కు తెరలేపింది. పేస్‌తో శిఖా పాండే, గూగ్లీలతో పూనమ్‌ మన మహిళల జట్టుకు అద్భుత గెలుపు అందించారు.

పూనమ్‌ యాదవ్‌
సిడ్నీ: ఆసీస్‌ మహిళల జట్టు భారత్‌ కంటే ఎంతో మెరుగైంది. మరెంతో పటిష్టమైంది. ప్రత్యేకించి పొట్టి ప్రపంచకప్‌లో ఎదురే లేని జట్టు ఆస్ట్రేలియా. ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్‌. ఇప్పుడు జరిగేది వారి సొంతగడ్డపైనే! దీంతో ప్రత్యర్థులకు డిఫెండింగ్‌ చాంపియన్‌ అంటే ఒకింత ‘కంగారూ’. అలాంటి జట్టునే భారత మహిళలు కంగు తినిపించారు. 11 మంది బ్యాటింగ్‌కు దిగితే తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ను 6 పరుగులలోపే అవుట్‌ చేశారు. ఇదంతా జరిగింది సిడ్నీలో అయితే... మహిళల టి20  ప్రపంచకప్‌లో భారత్‌ అదిరే ఆరంభానికి ఆసీస్‌ చెదిరిపోయింది.

ముఖ్యంగా స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (4/19) బౌలింగ్‌ వారిపట్ల సింహ స్వప్నమైంది. అందుకేనేమో క్రీజులో నిలబడే సాహసం, పరుగులు చేసే ప్రయత్నం వదిలి తలవంచేశారంతా! శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (46 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించింది. జెస్‌ జొనసెన్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరు గుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ హీలీ (35 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. పూనమ్‌ యాదవ్‌ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. శిఖా (3/14) నిప్పులు చెరిగింది.

రాణించిన దీప్తి

షఫాలీ (15 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులతో భారత్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా మొదలైంది. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున 4 ఓవర్లలో 41 పరుగులు చేశాక స్మృతి (10), షఫాలీ, హర్మన్‌ప్రీత్‌ (2) స్వల్పవ్యవధిలో అవుటయ్యారు. దీంతో ఏడో ఓవర్‌ ముగియకముందే భారత్‌ స్కోరు 47/3. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్‌ (33 బంతుల్లో 26) షాట్ల జోలికి వెళ్లకుండా దీప్తి శర్మతో కలిసి పరుగుల పోరాటం చేసింది. దీంతో మరో వికెట్‌ పడకుండా భారత్‌ 15.5వ ఓవర్లలో వందకు చేరుకుంది. అయితే మరుసటి బంతికే జెమీ మా... కిమిన్స్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ దశలో దీప్తికి వేద (9 నాటౌట్‌) జతయ్యింది.

హీలీ శ్రమ వృథా

ఫామ్, ర్యాంకింగ్, సొంతగడ్డపై మ్యాచ్‌ ఇలా ఏ రకంగా చూసిన భారత్‌ నిర్దేశించిన లక్ష్యం ఆసీస్‌కు కష్టమైందేమీ కాదు. అలాగే 5.3 ఓవర్లదాకా ఆస్ట్రేలియా స్కోరు 32/0. ఇక గెలిచేందుకు 101 చేస్తే సరిపోతుంది. కానీ మూనీ (6)ని శిఖా పాండే అవుట్‌ చేశాకా ఆట ఒక్కసారిగా మారిపోయింది. ఓపెనర్‌ హీలీ పోరాటం చేస్తున్నా... గార్డ్‌నర్‌ (34) అండగా నిలిచినా... లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయింది. వాళ్లిద్దరిని పెవిలియన్‌కు చేర్చిన పూనమ్‌ యాదవ్‌ తన స్పిన్‌ ఉచ్చును బిగించడంతో ఆసీస్‌ చెదిరిపోయింది. పూనమ్‌కు తోడు శిఖా పాండే నిప్పులు చెరుగుతుంటే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ కూలిపోయింది. లానింగ్‌ (5), హేన్స్‌ (6), పెర్రీ (0), జొనసెన్‌ (2), అన్నబెల్‌ (2), కిమిన్స్‌ (4), స్ట్రానో (2), షట్‌ (1 నాటౌట్‌) ఇలా ఏ ఒక్కరు నిలువలేకపోయారు.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) అన్నబెల్‌ (బి) పెర్రీ 29; మంధాన ఎల్బీడబ్ల్యూ (బి) జెస్‌ జొనసెన్‌ 10; జెమీమా ఎల్బీడబ్ల్యూ (బి) కిమిన్స్‌ 26; హర్మన్‌ప్రీత్‌ (స్టంప్డ్‌) హీలీ (బి) జెస్‌ జొనసెన్‌ 2; దీప్తి శర్మ నాటౌట్‌ 49; వేద కృష్ణమూర్తి నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు)132. 
వికెట్ల పతనం: 1–41, 2–43, 3–47, 4–100
బౌలింగ్‌: స్ట్రానో 2–0–15–0, పెర్రీ 3–0–15–1, షట్‌ 4–0–35–0, జెస్‌ జొనసెన్‌ 4–0–24–2, కిమిన్స్‌ 4–0–24–1, గార్డ్‌నర్‌ 3–0–19–0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హీలీ (సి) అండ్‌ (బి) పూనమ్‌ 51; మూనీ (సి) గైక్వాడ్‌ (బి) శిఖా 6; లానింగ్‌ (సి)భాటియా (బి) గైక్వాడ్‌ 5; హేన్స్‌ (స్టంప్డ్‌) భాటియా (బి) పూనమ్‌ 6; గార్డ్‌నర్‌ (సి) అండ్‌ (బి) శిఖా 34; పెర్రీ (బి) పూనమ్‌ 0; జెస్‌ (సి) భాటియా (బి) పూనమ్‌ 2; అన్నబెల్‌ (స్టంప్డ్‌) భాటియా (బి) శిఖా 2; కిమిన్స్‌ రనౌట్‌ 4; స్ట్రానో రనౌట్‌ 2; షట్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 115. 
వికెట్ల పతనం: 1–32, 2–55,3–67, 4–76, 5–76, 6–82, 7–101, 8–108, 9–113, 10–115. 
బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–17–0, రాజేశ్వరీ గైక్వాడ్‌ 4–0–31–1, శిఖా పాండే 3.5–0–14–3, అరుంధతి 4–0–33–0, పూనమ్‌ 4–0–19–4.

Advertisement
Advertisement