తొలి రోజు స్పెయిన్‌దే | India versus Spain Davis Cup World Group play-off tie — Ferrer takes first set | Sakshi
Sakshi News home page

తొలి రోజు స్పెయిన్‌దే

Sep 17 2016 12:49 AM | Updated on Sep 4 2017 1:45 PM

తొలి రోజు స్పెయిన్‌దే

తొలి రోజు స్పెయిన్‌దే

పటిష్టమైన స్పెయిన్ అంచనాలకు అనుగుణంగా రాణించి...భారత్‌తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.

రెండు సింగిల్స్‌లోనూ ఓడిన భారత ఆటగాళ్లు
* స్పెయిన్‌కు 2-0 ఆధిక్యం
* డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్

న్యూఢిల్లీ: పటిష్టమైన స్పెయిన్ అంచనాలకు అనుగుణంగా రాణించి...భారత్‌తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. శుక్రవారం ఇక్కడ మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఫలితంగా ఈ మాజీ చాంపియన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రామ్‌కుమార్ రామనాథన్‌తో తొలి మ్యాచ్‌లో ఆడాల్సిన స్పెయిన్ స్టార్ ప్లేయర్ రాఫెల్ నాదల్ చివరి నిమిషంలో వైదొలగడంతో అతని స్థానంలో ఫెలిసియానో లోపెజ్ బరిలోకి దిగాడు.

2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ లోపెజ్ 6-4, 6-4, 3-6, 6-1తో 203వ ర్యాంకర్ రామ్‌కుమార్‌ను ఓడించడంతో స్పెయిన్ శుభారంభం చేసింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్ 6-1, 6-2, 6-1తో భారత నంబర్‌వన్, ప్రపంచ 137వ ర్యాంకర్ సాకేత్ మైనేనిని ఓడించడంతో స్పెయిన్ 2-0తో ముందంజ వేసింది. శనివారం డబుల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడీతో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జట్టు తలపడుతుంది.
 
తొలి మ్యాచ్ నుంచి నాదల్ వైదొలిగినా స్పెయిన్‌కు ఎలాంటి ఇబ్బంది కాలేదు. భారత ప్లేయర్ రామ్‌కుమార్ తన శక్తివంచన లేకుండా కృషి చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఒకసెట్ గెలిచానన్న సంతృప్తి అతను మూటగట్టుకున్నాడు. తొలి రెండు సెట్‌లలో ఒక్కోసారి రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన లోపెజ్... మూడో సెట్‌లో మాత్రం తడబడ్డాడు. రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని మూడో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అరుుతే నాలుగో సెట్‌లో లోపెజ్ చెలరేగడంతో రామ్‌కుమార్ కేవలం ఒక్క గేమ్ మాత్రమే గెలిచాడు.
 
ఇక రెండో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సాకేత్ తన ప్రత్యర్థి ఫెరర్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఓవరాల్‌గా నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోగలిగాడు. నాలుగు ఏస్‌లు సంధించిన సాకేత్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఫెరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేయడంలో సఫలమైన ఈ వైజాగ్ ప్లేయర్ తన సర్వీస్‌ను మాత్రం ఎనిమిదిసార్లు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement