మా అట శైలి మారదు! | India Team Director Ravi Shastri Interview | Sakshi
Sakshi News home page

మా అట శైలి మారదు!

Sep 17 2015 1:32 AM | Updated on Sep 3 2017 9:31 AM

మా అట శైలి మారదు!

మా అట శైలి మారదు!

భారత క్రికెట్ జట్టు డెరైక్టర్‌గా రవిశాస్త్రి బాధ్యతలు స్వీకరించి ఏడాదైంది. ఈ సమయంలో కొన్ని చక్కటి విజయాలు సాధించిన జట్టు, మరికొన్ని సార్లు

►గత ఏడాదిగా ఎంతో శ్రమించాం
► నిలకడగా విజయాలు దక్కుతాయి
► భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఇంటర్వ్యూ

 
 భారత క్రికెట్ జట్టు డెరైక్టర్‌గా రవిశాస్త్రి బాధ్యతలు స్వీకరించి ఏడాదైంది. ఈ సమయంలో కొన్ని చక్కటి విజయాలు సాధించిన జట్టు, మరికొన్ని సార్లు విజయానికి చేరువగా వచ్చింది. అన్నింటికి మించి సీనియర్ల అండ లేని యువ జట్టులో స్ఫూర్తి నింపుతూ వారిని ప్రోత్సహిస్తున్న శాస్త్రి పనితీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. ఫలితంగా ఆయనతో పాటు మరో ముగ్గురు సహాయక కోచ్‌లకు కూడా టి20 ప్రపంచ కప్ వరకు పొడిగింపు దక్కింది. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌తో మొదలు పెట్టి పలు సిరీస్‌లతో టీమిండియా బిజీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన, అంచనాలపై రవిశాస్త్రి వివరంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే...
 
 టీమ్ డెరైక్టర్‌గా అనుభవం: గతంలో ఆటగాడిగానే కాకుండా  క్రికెట్‌కు సంబంధించి వేర్వేరు విషయాల్లో నా అనుబంధం కొనసాగింది. అయితే ఈ బాధ్యత మాత్రం చాలా ప్రత్యేకం. సరిగ్గా చెప్పాలంటే నాకు చాలా సంతృప్తినిచ్చిన పని ఇది. ప్రతిభ గల ఆటగాళ్లు, సరైన సహాయక సిబ్బంది అండగా ఉండటంతో ఈ సవాల్‌ను నేను స్వీకరించగలిగాను. దీనిని మరింత సమర్థవంతంగా నిర్వర్తించేదుకు ప్రయత్నిస్తా. శ్రీలంకలో సిరీస్ విజయం: ఇది మా ఏడాది శ్రమకు దక్కిన ఫలితం. ఇవన్నీ రాత్రికి రాత్రి జరిగిపోవు. వ్యవస్థను చక్కదిద్దాల్సి ఉంటుంది. ఆటగాళ్లందరి మదిలో గెలుపు భావన వస్తే మెల్లగా ప్రభావం కనిపిస్తుంది. టెస్టులకు సంబంధించి ఇదంతా ఆస్ట్రేలియాలో ప్రారంభం అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో కొనసాగి శ్రీలంకతో కనిపించింది.
 
 సహాయక సిబ్బంది: నా దృష్టిలో ముగ్గురూ ముగ్గురే. వీరంతా జనానికి కొత్త కావచ్చేమో కానీ చాలా కాలంగా, అండర్-19 స్థాయినుంచే భారత క్రికెట్ వ్యవస్థలో భాగంగా ఉన్నారు. శిక్షణలో చక్కటి అనుభవం ఉంది. భరత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్ అన్నప్పుడు అతనెవరు అన్నవాళ్లే ఇంకా ముందే తీసుకోవాల్సింది అంటున్నారు. వారు క్రికెటర్ల మనసెరిగి వారితో బాగా కలిసిపోయారు. ఆటగాళ్లు కూడా వారిపై నమ్మకముంచారు. జట్టు సభ్యులనుంచి మంచి ఫలితాలు రాబట్టేందుకు ఈ ముగ్గురు నిజాయితీగా శ్రమించడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయి.

 రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్: దక్షిణాఫ్రికా ప్రపంచ నంబర్‌వన్ జట్టు. వారిపై ఒత్తిడి పెంచాలంటే మనం చాలా నిలకడగా ఆడాల్సి ఉంటుంది. అయితే మా ఆట శైలిలో ఎలాంటి మార్పూ ఉండదు. ఆసీస్, లంక సిరీస్‌లలో చూస్తే ఎంత చిన్న తేడాతో ఓటమి, గెలుపు వచ్చాయో కనిపిస్తుంది. ఆధిక్యం ప్రదర్శించి కూడా ప్రత్యర్థిని మళ్లీ కోలుకోకుండా చేయాలంటే ఎంతో ఓపిక అవసరం. ఆస్ట్రేలియా, లంకతో తొలి టెస్టులో అది మాకు లేకుండా పోయింది. ఆ తర్వాత మెరుగవడం వల్లే లంకతో సిరీస్ గెలిచాం.

 ఇషాంత్ బౌలింగ్: తాను పూర్తి ఫిట్‌గా లేనంటూ స్వయంగా ప్రపంచకప్‌నుంచి తప్పించుకోవడం బాధాకరమే అయినా ఇషాంత్ తీసుకున్న నిర్ణయం సరైందే. తగిన విశ్రాంతితో అతను మరింతగా శ్రమించాడు. తన లోపాలపై దృష్టి పెట్టి సవరించుకున్నాడు. తన బౌలింగ్ బలమేమిటో అతనికి అర్థమైంది. దానిని అతను కొనసాగిస్తాడనే నమ్ముతున్నా. శ్రీలంకతో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇషాంత్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు లేకపోవడం దురదృష్టకరం.
 
 అశ్విన్ ప్రదర్శన: అశ్విన్‌కు వ్యోమగామికి ఉండే తెలివితేటలు ఉన్నాయి. తన తెలివికి ఓపికను జోడించి అతను భారత జట్టును పరుగెత్తిస్తున్నాడు. శ్రీలంకలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ అతనే. సంగక్కరను నాలుగు సార్లు అవుట్ చేసిన తీరు అశ్విన్ ఏమిటో చూపిస్తుంది. ఇకపై ఇలాంటి ప్రదర్శనలు ఇంకా చాలా రానున్నాయి.
 
 బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు: గొప్ప జట్టు సిద్ధమవుతోందనడానికి ఇది సూచన! ఎందుకంటే జట్టులో గాయాలు ఉన్నా ఎలాంటి సమస్య లేకుండా ఇతర ఆటగాళ్లు ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారంటే విశేషమే కదా. ఎవరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా శాశ్వతం కాదనే సందేశం అందరికీ వెళ్లిపోయింది. జట్టు అవసరాలకు అనుగుణంగానే ఆడాల్సి ఉంటుంది. ఆటగాళ్లు కూడా తన వల్ల కాదనో లేదా ఫలానా స్థానంలో ఆడలేననే సాకులు వెతకలేరు. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా ఎక్కడ ఆడించినా సఫలమయ్యారు. దీని వల్ల జట్టు సభ్యులలో గందరగోళం ఏర్పడుతుందనే మాటను నేను నమ్మను. నిజానికి శ్రీలంకలో వరుస గాయాల వల్ల స్థానాలు మార్చాల్సి వచ్చింది కానీ అదే తప్పనిసరి కాదు. ఒక సారి అంతా ఫిట్ అయితే దానిపై స్పష్టత వస్తుంది. అయితే ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమనే భావన బ్యాట్స్‌మెన్‌కు రావడం సంతోషకరం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement