భారత్‌కు ‘డ్రా’నందం

India Hold Belgium To A 2-2 Draw In Pool C Clash - Sakshi

బెల్జియంను నిలువరించిన టీమిండియా

2–2తో ముగిసిన మ్యాచ్‌

ప్రపంచకప్‌ హాకీ టోర్నీ  

భారత్‌ బాగా ఆడింది. తమకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న బెల్జియం జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. కానీ చివరి నిమిషాల్లో తడబడే  అలవాటు ఆతిథ్య జట్టును మళ్లీ వెంటాడింది. తుదకు గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది.   

భువనేశ్వర్‌
ప్రపంచకప్‌ హాకీలో భారత్‌ మరో స్ఫూర్తిదాయక పోరాటం చేసింది. రియో ఒలింపిక్స్‌ రన్నరప్‌ బెల్జియం జట్టును నిలువరించింది. పూల్‌ ‘సి’లో భాగంగా ఆదివారం భారత్, బెల్జియం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభంలో తడబడినప్పటికీ మ్యాచ్‌ జరిగేకొద్దీ ఆతిథ్య జట్టు ఆటగాళ్లు పుంజుకున్నారు. ఒక దశలో ప్రపంచ మూడో ర్యాంకర్‌ బెల్జియంను కంగుతినిపించే స్థితిలో నిలిచింది. అయితే చివరి క్షణాల్లో గోల్స్‌ సమర్పించుకొనే అలవాటును భారత్‌ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (39వ ని.లో), సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (47వ ని.లో) చెరో గోల్‌ చేయగా, బెల్జియం తరఫున హెన్‌డ్రిక్స్‌ (8వ ని.లో), సైమన్‌ గోనర్డ్‌ (56వ ని.లో) గోల్స్‌ సాధించారు.

ఆఖరి నిమిషాల్లో భారత డిఫెన్స్‌ కాస్త డీలా పడటంతో ఇదే అదనుగా భావించిన సైమన్‌ బెల్జియంను ఓటమి నుంచి తప్పించాడు. ఫలితం ‘డ్రా’ అయినా... ఈ పూల్‌లో భారతే అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో 5–0తో గెలుపు, గోల్స్‌ పరంగా బెల్జియం కంటే భారత్‌నే ముందువరుసలో నిలబెట్టింది. రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత బెల్జియం తొలి మ్యాచ్‌లో (2–1తో) కెనడాను ఓడించినా... గోల్స్‌ రేట్‌లో భారతే ఎంతో ముందుంది. ఈ పూల్‌లో ఇరుజట్లకు ఇక ఒకే మ్యాచ్‌ మిగిలుంది. ఈ నెల 8న జరిగే మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్, దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడతాయి. ఇవి ముగిశాక తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌ అగ్రస్థానంలోనే ఉంటే నేరుగా క్వార్టర్స్‌ చేరుకుంటుంది.

కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కూడా...
ఇదే పూల్‌లో కెనడా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్‌ కూడా 1–1తో ‘డ్రా’ అయింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కడంతో రెండు క్వార్టర్లు గోల్‌ లేకుండానే ముగిశాయి. మూడో క్వార్టర్‌ చివర్లో దక్షిణాఫ్రికా తరఫున ఎన్‌కొబిలి ఎన్‌తులి (43వ ని.) గోల్‌ చేయగా, రెండు నిమిషాల వ్యవధిలోనే కెనడా కెప్టెన్‌ స్కాట్‌ టపర్‌ (45వ ని.) గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్‌; న్యూజిలాండ్‌తో అర్జెంటీనా తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top