ప్రతీకారం... సెమీస్‌ ద్వారం!

India is fighting with Ireland today for women hockey World Cup - Sakshi

మహిళల హాకీ ప్రపంచకప్‌లో నేడు ఐర్లాండ్‌తో భారత్‌ పోరు

గెలిస్తే 44 ఏళ్ల తర్వాత సెమీస్‌కు టీమిండియా

లండన్‌: ఒకే మ్యాచ్‌తో అటు చరిత్ర సృష్టించేందుకు, ఇటు లీగ్‌ దశ ఓటమికి బదులు తీర్చుకునేందుకు భారత మహిళల హాకీ జట్టుకు చక్కటి అవకాశం. ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం ఐర్లాండ్‌తో జరుగనున్న క్వార్టర్‌ ఫైనల్‌ ఇందుకు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 1974 తర్వాత టీమిండియా ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌కు చేరుతుంది. భారత్‌ (10) కంటే తక్కువ ర్యాంకులో ఉన్నప్పటికీ ఐర్లాండ్‌ (16) టోర్నీలో నిలకడగా ఆడుతోంది. లీగ్‌ దశలో అమెరికాను 3–1తో, భారత్‌ను 1–0 తేడాతో ఓడించింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై 0–1తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మరోవైపు రాణి రాంపాల్‌ ఆధ్వర్యంలోని టీమిండియా... అమెరికా, ఇంగ్లండ్‌లతో 1–1తో డ్రా చేసుకుని ఐర్లాండ్‌ చేతిలో 0–1తో ఓడింది.

ప్రి క్వార్టర్స్‌ అనదగ్గ క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో మాత్రం జూలు విదిల్చి ఇటలీని 3–0తో ఇంటికి పంపింది. ఇదే ఊపును కొనసాగిస్తే రాణి సేన ప్రత్యర్థిపై పైచేయి సాధించగలదు. అయితే, ఐర్లాండ్‌ కొన్నాళ్లుగా మన జట్టుకు కొరుకుడు పడనిదిగానే ఉంది. ఈ టోర్నీతో పాటు, గతేడాది హాకీ ప్రపంచ లీగ్‌ సెమీస్‌లో 2–1తో టీమిండియాను మట్టికరిపించింది. ఈ విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు బరిలో దిగనుంది. గోల్‌కీపర్‌ సవిత ఆధ్వర్యంలోని భారత రక్షణ శ్రేణి ప్రస్తుత కప్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తోంది. ఫార్వర్డ్స్‌ కూడా కుదురుకున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

►రాత్రి గం. 10.25 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top