అఫ్గాన్‌తో టెస్టు: భారత్‌ 474 ఆలౌట్‌ | India end up with substantial 474 | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌తో టెస్టు: భారత్‌ 474 ఆలౌట్‌

Jun 15 2018 11:39 AM | Updated on Mar 28 2019 6:10 PM

India end up with substantial 474 - Sakshi

బెంగళూరు:  అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్‌ ఆటగాడు అశ్విన్‌(7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరగా, మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క‍్రమంలోనే హార్దిక్‌ పాండ్యా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత కాసేపటికి రవీంద్ర జడేజా(20) ఔట్‌ కావడంతో 436 పరుగుల వద్ద భారత్‌ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్‌(71;94 బంతుల్లో 10 ఫోర్లు) సైతం పెవిలియన్‌ చేరాడు.

ఇక చివర్లో ఉమేశ్‌ యాదవ్‌(26 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇషాంత్‌ శర్మ(8)తో కలసి ఆఖరి వికెట్‌కు ఉమేశ్‌ యాదవ్‌ 34 పరుగులు జత చేశాడు.  అంతకుముందు తొలి రోజు ఆటలో శిఖర్‌ ధావన్‌(107), మురళీ విజయ్‌(105), కేఎల్‌ రాహుల్‌(54)లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో యమీన్‌ అహ్మద్‌జాయ్‌ మూడు వికెట్లతో రాణించగా, వఫాదార్‌, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు తలో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement