వన్డేల్లో శివం దూబే అరంగేట్రం

Ind vs WI: Shivam Dube Odi Debuts For India - Sakshi

చెన్నై: ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం​ చేసిన టీమిండియా యువ ఆల్‌ రౌండర్‌ శివం దూబే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. దూబేను పూర్తి స్థాయిలో పరిశీలించాలనే యోచనలో ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ దానిలో భాగంగా అతనికి వన్డేల్లో అవకాశం ఇచ్చింది. విండీస్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఆకట్టుకోవడంతో వన్డేల్లో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఇక  మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇవ్వని మేనేజ్‌మెంట్‌.. కేఎల్‌ రాహుల్‌ను జట్టులోకి తీసుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌లకు సైతం తుది జట్టులో చోటు దక్కింది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ షమీలను ఎంపిక చేసింది.

రవీంద్ర జడేజాకు అవకాశం ఇవ్వగా,  యజ్వేంద్ర చహల్‌కు విశ్రాంతినిచ్చారు. కుల్దీప్‌ యాదవ్‌కు సైతం తుది జట్టులో చోటు దక్కింది. ఓవరాల్‌గా పార్ట్‌ బౌలర్లతో కలిసి ఆరు బౌలర్లను టీమిండియా ఎలెవన్‌లో ఎంపిక చేశారు.  రిజ్వర్‌ బెంచ్‌కు పరిమితమైన వారిలో చహల్‌, మయాంక్‌ అగర్వాల్‌లతో పాటు శార్దూల్‌ ఠాకూర్‌, మనీష్‌ పాండేలు ఉన్నారు. నగరంలోని చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచిన విండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 2006–07 సీజన్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌లో ఆరుసార్లు పర్యటించిన విండీస్‌ ఖాళీ చేతులతోనే వెళ్లింది. దాంతో భారత్‌ జట్టు మరోసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దీనికి తగినట్లుగానే కోహ్లి, రోహిత్, రాహుల్‌లతో కూడిన భారత టాపార్డర్‌ దుర్భేద్యంగా ఉంది.

టీమిండియా తుది జట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, శివం దూబే, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ

విండీస్‌ తుది జట్టు
పొలార్డ్‌(కెప్టెన్‌), షాయ్‌ హోప్‌, సునీల్‌ అంబ్రిస్‌, షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, జాసన్‌ హోల్డర్‌, కీమో పాల్‌, హేడెన్‌ వాల్ష్‌, అల్జారీ జోసెష్‌, షెల్డాన్‌ కాట్రెల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top