అశ్విన్‌ సరికొత్త రికార్డు

Ind vs Ban: Ashwin New Record Fewest Tests To 250 Wkts At Home - Sakshi

ఇండోర్‌: టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త రికార్డు సాధించాడు.  భారత్‌ తరఫున అతి తక్కువ టెస్టుల్లో స్వదేశంలో 250 వికెట్లు సాధించిన రికార్డును అశ్విన​ ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ వికెట్‌ను తీయడం ద్వారా స్వదేశంలో 250 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే అశ్విన్‌కు ఇది స్వదేశంలో 42వ టెస్టు. దాంతో తక్కువ టెస్టుల్లో భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు.

కుంబ్లే తన 43వ స్వదేశీ టెస్టులో 250 స్వదేశీ వికెట్‌ను సాధించాడు. ఈ జాబితాలో హర్భజన్‌ సింగ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. హర్భజన్‌ 51వ స్వదేశీ టెస్టులో ఈ ఫీట్‌ నెలకొల్పాడు. ఓవరాల్‌ జాబితా పరంగా చూస్తే స్వదేశంలో 250 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం మురళీ ధరన్‌తో కలిసి అశ్విన​ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ముత్తయ మురళీ ధరన్‌ కూడా 42వ స్వదేశీ టెస్టులోనే ఈ ఘనతను సాధించాడు. కాగా, టెస్టుల్లో అనిల్‌  కుంబ్లే, హర్భజన్‌ల తర్వాత ఈ ఫీట్‌  సాధించిన తొలి భారత బౌలర్‌ కూడా అశ్వినే కావడం విశేషం. ఇప్పటివరకూ అశ్విన్‌ ఖాతాలో 359 టెస్టు వికెట్లు ఉన్నాయి.

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ 115 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. ఓపెనర్లు షాద్‌మన్‌ ఇస్లామ్‌(6), ఇమ్రుల్‌(6)లను ఇషాంత్‌, ఉమేశ్‌లు వరుసగా పెవిలియన్‌కు పంపితే, మూడో వికెట్‌గా మహ్మద్‌ మిథున్‌(13) పెవిలియన్‌ చేరాడు. మిథున్‌ను షమీ ఔట్‌ చేశాడు. ఆపై భారత్‌కు లభించిన రెండు వికెట్లు అశ్విన్‌ ఖాతాలోనే పడ్డాయి. మోమిన్‌ల్‌తో పాటు మహ్మదుల్లా(10)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ బంగ్లాను మోమినుల్‌- ముష్ఫికర్‌ రహీమ్‌లను చక్కదిద్దారు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top