టాప్‌-10లోకి మళ్లీ బుమ్రా

ICC Test Rankings: Jasprit Bumrah Moves Back into Top 10 - Sakshi

‘టాప్‌’లోనే భారత్‌

రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తన ‘టాప్‌’ స్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 0–2తో వైట్‌వాష్‌ చేయించుకున్నా... 116 ర్యాంకింగ్‌ పాయింట్లతో భారత్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది. 110 రేటింగ్‌ పాయింట్లతో న్యూజిలాండ్‌... 108 రేటింగ్‌ పాయింట్లతో ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

బ్యాటింగ్‌ విభాగంలో విరాట్‌ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమైన కోహ్లి గత వారం టాప్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నాలుగు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 38 పరుగులే చేయడం గమనార్హం. ఈ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా... స్మిత్‌ సహచరుడు మార్నస్‌ లబ్‌షేన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ ఒక స్థానం పడిపోయి పదో ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టుల్లో పునరాగమనం చేసిన భారత యువ ఓపెనర్‌ పృథ్వీ షా ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 76వ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్ ర్యాకింగ్స్‌లో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మళ్లీ టాప్‌టెన్‌లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని బుమ్రా ఏడో ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు స్థానాల్లో ఉన్నారు. (చదవండి: నంబర్‌ 1 బ్యాటర్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్‌ ట్వీట్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top