ఇక నుంచి టెస్టు చాంపియన్‌షిప్‌

ICC agrees to nine-team Test championship

వెల్లింగ్టన్‌: దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలని యోచిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆ మేరకు కార్యాచరణ రూపొందించేందుకు ముందడుగు వేసింది. టెస్టు చాంపియన్‌ షిప్‌కు ఐసీసీ ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టు చాంపియన్‌ ఫిప్‌తో పాటు అంతర్జాతీయ వన్డేలీగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు 4 రోజుల టెస్టు మ్యాచ్‌ల ప్రయోగాలను చేపట్టుకోవచ్చని టెస్టు హోదా ఉన్న దేశాలుకు అనుమతిచ్చింది. 

అక్లాండ్‌లో శుక్రవారం ఐసీసీ గవర్నింగ్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌  మీడియాతో మాట్లాడారు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఈ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రారంభం అవుతుందని, ఫైనల్‌ను 2021లో నిర్వహిస్తామని ప్రకటించారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో 9 దేశాలు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్లొంటాయని పేర్కొన్నారు. రెండేళ్లపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 9 దేశాలు మొత్తం ఆరు సిరీస్‌లు ఆడుతాయన్నారు.

మూడు సిరీస్‌లు స్వదేశంలో, మరో మూడింటిని విదేశాల్లో ఆడతాయని రిచర్డ్సన్‌ వివరించారు. సిరీస్‌లో కనిష్ఠంగా రెండు మ్యాచ్‌లు.. గరిష్ఠంగా ఐదు మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. టాప్‌లో నిలిచిన రెండు దేశాలు ఏప్రిల్‌ 2021లో జరిగే టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తలపడతాయన్నారు. ఈ  చాంపియన్‌షిప్‌ గురించి  మరింత కసరత్తు చేయాల్సి ఉందని తెలిపారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో.. జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌లను మినహాయించినట్లు రిచర్డ్‌సన్‌ తెలిపారు. 2021 నుంచి 13 జట్ల వన్డే ఇంటర్నేషనల్‌ లీగ్‌ను కూడా ప్రవేశపెడతామని చెప్పారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top