‘నాలుగు’ నాకు కొత్త కాదు! 

I have been batting in middle order for long: Ambati Rayudu - Sakshi

ఒత్తిడేమీ లేదన్న రాయుడు 

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టానన్న హైదరాబాద్‌ క్రికెటర్‌   

సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు అన్నాడు. నాలుగో స్థానంలో ఆడటం తనకు అలవాటేనని అతను చెప్పాడు. ‘చాలా కాలంగా నేను నాలుగో స్థానంలో ఆడుతున్నాను. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆ స్థానంలో ఆడమని చెప్పడంలో కొత్తేమీ లేదు. నేను నాలుగో స్థానానికి సరైన వాడినంటూ కెప్టెన్‌ కోహ్లి చేసిన వ్యాఖ్య వల్ల ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు. అదేమీ అదనపు బాధ్యత కాదు. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. అంతకుమించి ఇంకేమీ ఆలోచించడం లేదు’ అని రాయుడు స్పష్టం చేశాడు. ఆసియా కప్‌లో రాణించిన రాయుడు, అంతకుముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా...యో యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే నిర్దేశిత ఫిట్‌నెస్‌ ప్రమాణాలకు తానేమీ వ్యతిరేకం కాదని అతను వెల్లడించాడు. ‘నేను యో యో టెస్టులో ఉత్తీర్ణత సాధించడం సంతోషమే. అయితే ఈ టెస్టుకు, నా ఫిట్‌నెస్‌ సన్నద్ధతకు ఎలాంటి సంబంధం లేదు.

ఒకసారి గాయపడిన తర్వాత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. సిరీస్‌ల మధ్యలో దొరికే కొద్దిపాటి విరామంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు వెళ్లి ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తుంటాను. నిజానికి ఐపీఎల్‌కు ముందే దీనిపై శ్రమించాను. ఫిట్‌నెస్‌పరంగా చూస్తే పునరాగమనం చేసేందుకు నాకు ఐపీఎల్‌ మంచి అవకాశం ఇచ్చింది’ అని రాయుడు పేర్కొన్నాడు.   మరోవైపు మున్ముందు ఎలాంటి సవాల్‌కైనా మిడిలార్డర్‌ సిద్ధంగా ఉండాలని రాయుడు అన్నాడు. ‘భారత టాప్‌–3 అద్భుతంగా రాణిస్తుండటం గొప్ప విషయం. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ కూడా ఎప్పుడు ఏ సవాల్‌ ఎదురైనా బాగా బ్యాటింగ్‌ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. నాకు తెలిసి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జట్టులో పరిస్థితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. సిరీస్‌లో ఒక్కటే మ్యాచ్‌ ముగిసింది. తర్వాతి మ్యాచ్‌లలో విండీస్‌ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నా’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top