ఆపరేషన్‌ సిందూర్‌ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు | Ambati Rayudu Sparks Controversy With Eye For An Eye Comment Amid India Pakistan Tensions | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు

May 9 2025 10:22 AM | Updated on May 9 2025 1:04 PM

Ambati Rayudu Sparks Controversy With Eye For An Eye Comment Amid India Pakistan Tensions

పహల్గామ్‌ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్‌ దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 పేరిట భారత బలగాలు ఇస్తున్న ధీటైన సమాధానంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్‌ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో దుమారం రేపుతుంది. రాయుడును నెటిజన్లు ఆడుకుంటున్నారు.

విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని మండిపడుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతి చర్యకు దిగికపోతే వారు మనల్ని మట్టుబెడతారని అంటున్నారు. పాక్‌ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. భారత దళాలు పాక్‌ దుశ్చర్యలను కేవలం​ తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.

తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు డిఫెన్స్‌లో పడ్డాడు. సదరు ట్వీట్‌ను తొలగించకపోయినా, జనాలను శాంతింప జేసేందుకు మరో రెండు ట్వీట్‌లు చేశాడు. వీటిలో మొదటి దాంట్లో ఇలా రాసుకొచ్చాడు.  

జమ్మూ కశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.

రెండో ట్వీట్‌లో ఇలా రాశాడు. ఇలాంటి క్షణాల్లో మేము భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాము. అసమాన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా ఉండవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత రేపటికి మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.

రాయుడు ముందు చేసిన ట్వీట్‌కు డ్యామేజ్‌ కంట్రోల్‌గా ఈ ట్వీట్లు చేసినప్పటికీ జనాల ఆగ్రహం తగ్గలేదు. మొదటి ట్వీట్‌నే ఆసరగా చేసుకుని ఏకి పారేస్తున్నారు. టీమిండియా, ఐపీఎల్‌, రాజకీయాలతో ముడిపెట్టి తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తాన్ని ఐపీఎల్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేల రాయుడు క్రికెట్‌ అభిమానులకు మంచి స్టఫ్‌గా మారాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement