హంటర్స్‌ ఆట ముగిసింది 

Hyderabad lost in the semi finals of Mumbai rackets - Sakshi

సెమీఫైనల్లో ముంబై రాకెట్స్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌

బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ ఆట ముగిసింది. పీవీ సింధు తనదైన జోరుతో రాణించినా... సహచరులంతా నిరాశపర్చడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై రాకెట్స్‌ 4–2తో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. నేడు జరిగే ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.  మొదట జరిగిన పురుషుల డబుల్స్‌లో బొదిన్‌ ఇసారా–కిమ్‌ స రంగ్‌ (హైదరాబాద్‌) జోడీ 14–15, 12–15తో కిమ్‌ జీ జంగ్‌– లీ యంగ్‌ డే ద్వయం చేతిలో ఓడింది. తర్వాత పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌ను ముంబై ‘ట్రంప్‌’గా ఎంచుకోగా ఇందులో సమీర్‌ వర్మ 15–8, 15–7తో మార్క్‌ కాల్జౌ (హైదరాబాద్‌)ను ఓడించాడు. దీంతో హంటర్స్‌ 0–3తో వెనుకబడింది.

పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయిన ఈ దశలో... హైదరాబాద్‌ ఆశల్ని సింధు నిలబెట్టింది. హంటర్స్‌ ‘ట్రంప్‌’ అయిన మహిళ సింగిల్స్‌లో ఆమె 15–6, 15–5తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై అలవోక విజయం సాధించింది. దీంతో హైదరాబాద్‌ 2–3తో టచ్‌లోకి వచ్చింది. కానీ అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్‌ (హైదరాబాద్‌) 13–15, 6–15తో అండర్స్‌ అంటోన్సెన్‌ (ముంబై) చేతిలో కంగుతినడంతో హంటర్స్‌ ఖేల్‌ ఖతమైంది. ఫలితం తేలడంతో అప్రధానమైన మిక్స్‌డ్‌ డబుల్స్‌ను ఆడించలేదు. ఈ పోరులో సింధు బాధ్యత కనబరిస్తే మిగతా షట్లర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏ ఒక్కరూ ఒక్క గేమైనా గెలవకుండా... వరుస గేముల్లో ప్రత్యర్థికి తలవంచారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top