క్రికెటర్‌ శ్రీశాంత్‌కు భారీ ఎదురుదెబ్బ!

High Court Restores Life Ban Imposed On Sreesanth

సాక్షి, కొచ్చి: క్రికెటర్‌ ఎస్‌ శ్రీశాంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరిస్తూ.. కేరళ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు వెలువరించింది. శ్రీశాంత్‌పై భారత క్రికెట్‌ సంఘం (బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్‌ చేసింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో దొరికిపోయిన శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్‌-6 సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది.

ఊరట.. ఇంతలోనే షాక్‌!
తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న శ్రీశాంత్‌కు గత ఆగస్టు నెలలో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఆగస్టు 7న తీర్పునిచ్చింది. నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐ  క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

2013లో జరిగిన ఐపీఎల్‌-6లో శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది.

అయితే, కేరళ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ బీసీసీఐ.. ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. గతనెల పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై నిషేధాన్ని పునరుద్ధరించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top