Sakshi News home page

నిరాశ... అయినా ఆనందమే!

Published Mon, Feb 27 2017 12:10 AM

నిరాశ... అయినా ఆనందమే!

ప్రపంచ చాంపియన్‌షిప్‌ ప్రదర్శనపై ‘సాక్షి’తో హారిక  
సాక్షి, హైదరాబాద్‌: గత రెండు ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలతో సంతృప్తి పడిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తుందని అందరూ భావించారు. అయితే కీలకదశలో అదృష్టం కలిసి రాకపోవడంతో ఆమె మూడోసారీ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనా క్రీడాకారిణి తాన్‌ జోంగితో చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్‌ టైబ్రేక్‌లో హారిక ఓటమి చవిచూసింది. ఈసారీ హారిక కాంస్యమే నెగ్గినా అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. వరుసగా మూడు ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ (నాకౌట్‌ ఫార్మాట్‌) పోటీల్లో పతకం నెగ్గిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2004, 2008, 2010లలో) కూడా మూడు కాంస్యాలు నెగ్గినా వరుస చాంపియన్‌షిప్‌లలో ఆమె ఈ పతకాలను సాధించలేదు. ఈ టోర్నీ వేదికగా నిలిచిన ఇరాన్‌ రాజధాని టెహరాన్‌ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం బయలుదేరేముందు ఈ మెగా ఈవెంట్‌లో ప్రదర్శనపై హారిక ‘సాక్షి’తో ముచ్చటించింది.

మూడోసారీ కాంస్యమే సాధించారు... ఎలా అనిపిస్తోంది?
నా అనుభూతిని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఒకవైపు నిరాశ కలుగుతోంది. మరోవైపు వరుసగా 3సార్లు ఈ మెగా ఈవెంట్‌లో పతకం సాధించినందుకు ఆనందంగా కూడా ఉంది.  

టోర్నీ ఆసాంతం మీ ప్రదర్శనను విశ్లేషిస్తే...
క్లాసికల్‌ గేమ్స్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. సులువుగా గెలవాల్సిన చోట లేదా ‘డ్రా’ చేసుకోవాల్సిన సమయంలో కాస్త తడబడ్డాను. అయినప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఒత్తిడిని అధిగమించి రాణించినందుకు సంతోషంగా ఉన్నాను.

సెమీఫైనల్‌ టైబ్రేక్‌లో ఎక్కడ పొరపాటు జరిగింది?
ర్యాపిడ్‌ పద్ధతిలో జరిగిన టైబ్రేక్‌ తొలి గేమ్‌లో బాగా ఆడి గెలిచాను. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్న సమయంలో రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే తొందరలో తప్పటడుగు వేశాను. కీలక దశలో బంటును కోల్పోయి గేమ్‌లో ఓటమి చెందాను.

ఫైనల్‌ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన సెమీఫైనల్‌ రెండో గేమ్‌లో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
ఈ గేమ్‌ ఆరంభంలోనే నేను విజయావకాశాలను సృష్టించుకున్నాను. కానీ కీలకదశలో పొరపాటు చేసి నా ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాను. అయితే ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో అనుభవాన్నంతా రంగరించి పోరాడాను. చివరకు 6 గంటలపాటు జరిగిన ఈ గేమ్‌లో నేను 162 ఎత్తుల వరకు ఆడాల్సి వచ్చింది.

సెమీఫైనల్‌ చేరే క్రమంలో మీకు అన్ని మ్యాచ్‌లలో టైబ్రేక్‌లోనే విజయాలు దక్కడాన్ని ఎలా చూస్తారు?
ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ కాబట్టి అందరూ పక్కాగా సిద్ధమై వచ్చారు. నా తొలి రౌండ్‌ ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు చెందిన షమీమా ఆమె రేటింగ్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. నాకౌట్‌ టోర్నమెంట్‌ కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా, రిస్క్‌ తీసుకోకుండా ఆడాను. అయితే అన్ని టైబ్రేక్‌లలో నా ప్రదర్శన బాగా ఉంది. ఈ టోర్నీలో నాతోపాటు ఉన్న మా అమ్మమ్మ అన్ని విధాలా అండగా నిలిచింది. క్లిష్ట సమయంలో ఆమె మద్దతు నాకు ఎంతో ఉప యోగపడింది. ఎలాంటి విరామం తీసుకోకుండా వచ్చే నెలలో రెండు అంతర్జాతీయ టోర్నీలలో (షార్జా, ఐస్‌లాండ్‌) ఆడనున్నాను.

Advertisement
Advertisement