దక్షిణాఫ్రికాకు షాక్‌.. ఆమ్లా రిటైర్డ్‌ హర్ట్‌

Hashim Amla retires hurt after being hit on helmet - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా గాయపడ్డాడు.  ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన నాల్గో ఓవర్‌ ఐదో బంతిని పుల్‌ షాట్‌ ఆడబోయి ఆమ్లా గాయపడ్డాడు. దాంతో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆర్చర్‌ వేసిన సదరు బంతి 145 కి.మీ వేగంతో దూసుకొచ్చి ఆమ్లా హెల్మెట్‌ను బలంగా తాకింది.  ఈ క్రమంలోనే మైదానంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆమ్లా హెల్మెట్‌ను మార్చడం కోసం సంకేతాలు ఇవ్వడంతో మోరిస్‌ కొన్ని హెల్మెట్లను  మైదానంలోకి తీసుకొచ్చాడు. అయితే ఆ హెల్మెట్లు ఆమ్లాకు సరిపోలేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికా ఫిజియో కూడా మైదానంలోకి వచ్చి ఆమ్లాను పరీక్షించాడు. బంతి తగిలిన చోట కొద్దిపాటి వాపు కూడా రావడంతో ఆమ్లా మైదానాన్ని వీడాడు. ఇలా ఆమ్లా మైదానాన్ని వీడటం దక్షిణాఫ్రికా శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది. ఇంకా ఆమ్లా గాయంపై స్పష్టత రాలేదు.
(ఇక్కడ చదవండి: మోర్గాన్‌.. తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా)

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీకాక్‌, ఆమ్లాలు ఆరంభించారు. ఆమ్లా రిటైర్డ్‌ హర్ట్‌ కాగా, దక్షిణాఫ్రికా పది ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మర్కరమ్‌(11), డుప్లెసిస్‌(5)లు నిరాశపరిచారు. ఫలితంగా సఫారీలు 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయారు. దక్షిణాఫ్రికా కోల్పోయిన తొలి రెండు వికెట్లను జోఫ్రా ఆర్చర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top