కోహ్లి రికార్డు బ్రేక్‌.. ఆమ్లాపై విమర్శలు

Hashim Amla Breaks Virat Kohli Record - Sakshi

పోర్ట్ ఎలిజబెత్: క్రికెట్‌లో విజయాలు, రికార్డులనేవి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఇంటి చిరునామాగా మారిన విషయం తెలిసిందే. మహామహా సారథులు, ఆటగాళ్లతో సాధ్యం కాని పలు రికార్డులు, విజయాలను టీమిండియాకు అందించిన ఘనత కోహ్లికి దక్కుతుంది. అయితే కోహ్లికి సంబంధించిన ఓ రికార్డును తాజాగా దక్షిణాప్రికా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ ఆమ్లా అధిగమించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో సాధించిన శతకం సాధించడంతో కోహ్లిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు. కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకోగా.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. 2017, జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 

ఆమ్లా(108;120 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్‌) సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ.. ఆ జట్టు 300 పరుగుల మార్క్ కూడా చేరలేకపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నప్పటికీ ధాటిగా ఆడకుండా సెంచరీ కోసం తాపత్రయపడ్డాడని మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఆమ్లా తన స్వార్థం చూసుకోకుండా ఆడి ఉంటే జట్టు స్కోరు 300 దాటేదని.. అప్పుడు దక్షిణాఫ్రికా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండేవని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top