ఐపీఎల్‌లో సత్తా చాటినప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం తనకు బాధ కలిగించిందని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు.
హర్భజన్ సింగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సత్తా చాటినప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం తనకు బాధ కలిగించిందని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. జట్టును ఎంపిక చేసిన ప్రతీసారి తనను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల తాను నిరాశకు గురికానని, మళ్లీ సత్తా చాటి భారత జట్టులో చోటు సంపాదిస్తానని చెప్పాడు. ‘భారత జట్టులోకి ఎంపిక కానప్పుడు నేను బాధపడ్డా. ఈ ఐపీఎల్‌లో నా ఆటతీరు ఎలా ఉందో అందరూ చూసే ఉంటారు. భారత స్పిన్నర్లలో నేనే బాగా బౌలింగ్ చేశా. జట్టులోకి ఎంపిక కాకపోయినంత మాత్రాన నేనేమీ నిరాశ చెందను.
కచ్చితంగా మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తా’ అని భజ్జీ అన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-7లో హర్భజన్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. నరైన్, అక్షర్ పటేల్ తర్వాత బౌలింగ్ ఎకానమీ మెరుగ్గా ఉన్న స్పిన్నర్ హర్భజనే. ఓ వైపు నరైన్, అక్షర్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో ఇబ్బంది పడితే హర్భజన్ మాత్రం మ్యాక్స్‌వెల్, గేల్ లాంటి విధ్యంసకర బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపడంలో విజయవంతమయ్యాడు. ఇక తన ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు భజ్జీ ఈ ఏడాది కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు.