మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ కన్నుమూత | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ కన్నుమూత

Published Tue, May 17 2016 1:31 AM

మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ కన్నుమూత

ముంబై: పాత తరం భారత టెస్టు క్రికెటర్ దీపక్ శోధన్ (87) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో అహ్మదాబాద్‌లోని సొంతింట్లో తుది శ్వాస విడిచారు. ఎడంచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్ చేసే శోధన్ భారత్ తరఫున మూడు టెస్టులు ఆడారు. 1952లో పాకిస్తాన్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టులో ఆయన అరంగేట్రం చేశారు. ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ (110 పరుగులు) చేసిన తొలి భారత క్రికెటర్‌గా దీపక్ శోధన్ గుర్తింపు పొందారు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ పర్యటనకు జట్టులో చోటు సంపాదించినా... కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 45, 11 పరుగులు చేసిన శోధన్ గాయంతో తర్వాతి మూడు టెస్టులకు దూరమయ్యారు. కింగ్‌స్టన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో బరిలోకి దిగినా పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత 1962 వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కొనసాగినా జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. 43 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 1802 పరుగులు, 73 వికెట్లు తీశారు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి.

Advertisement
Advertisement