కష్టకాలంలో క్రీడాకారుల ఔదార్యం

Football And tennis celebrities donate big amounts to coronavirus battle - Sakshi

కోవిడ్‌–19 బాధితుల సహాయార్థం

భారీ మొత్తంలో విరాళాలు

క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్‌... ఆటలు ఏవైనా ఔదార్యం ప్రదర్శించడంలో మాత్రం అంతా ముందుకొస్తున్నారు. కరోనా ప్రమాద సమయంలో దిగ్గజ క్రీడాకారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు సహాయానికి సిద్ధమయ్యారు.  

మెస్సీ విరాళం... రూ. 8 కోట్ల 30 లక్షలు
బార్సిలోనా: కోవిడ్‌–19 విలయ తాండవం చేస్తోన్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్, బార్సిలోనా ఫార్వర్డ్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ, మాంచెస్టర్‌ సిటీ మేనేజర్‌ పెప్‌ గార్డియోలా ముందుకొచ్చారు. ఈ మహ మ్మారి నియంత్రణ కోసం చెరో పది లక్షల యూరో లు (రూ. 8.32 కోట్లు) చొప్పున విరాళం ఇచ్చారు.  

రొనాల్డో... 3 ఐసీయూలు
మరోవైపు పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. పోర్చుగీస్‌ ఆసుపత్రుల కోసం తన ఏజెంట్‌ జార్జ్‌ మెండెస్‌తో కలిసి మూడు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు (ఐసీయూ)లను అందజేయనున్నాడు.    

ఫెడరర్‌ చేయూత రూ. 7 కోట్ల 86 లక్షలు...
బెర్న్‌: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తన దేశంలో కరోనా (కోవిడ్‌–19)తో ముప్పు పొంచి ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి ముందుకు వచ్చా డు. తన భార్య మిర్కాతో కలిసి 10 లక్షల స్విస్‌ ఫ్రాంక్స్‌ను (రూ. 7 కోట్ల 86 లక్షలు) కరోనాతో పోరాడటం కోసం వారికి అందజేసినట్లు తెలిపాడు.   

బంగ్లా క్రికెటర్ల బాసట...
ఢాకా: కరోనాపై పోరాటంలో ఆర్థికపరంగా తమ వంతు చేయూతనందించేందుకు వివిధ దేశాల క్రికెటర్లు ముందుకొస్తున్నారు. బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన 27 మంది క్రికెటర్లు తమ సగం రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం సుమారు 25 లక్షల టాకాలకు (సుమారు రూ. 23 లక్షలు) సమానం.  

శ్రీలంక, పాకిస్తాన్‌ కూడా...
కరోనా సంబంధించి చికిత్సలో కీలకమైన వీడియో లారింగోస్కోప్‌ తదితర వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు కావాల్సిన మొత్తాన్ని అందజేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రకటించింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా తమ తరఫు నుంచి 2 కోట్ల 50 లక్షల శ్రీలంక రూపాయలు (సుమారు 1 కోటి 2 లక్షలు) ఇస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌ జాతీయ జట్టు క్రికెటర్లు కూడా అందరూ కలిసి 50 లక్షల పాకిస్తాన్‌ రూపాయలు (సుమారు రూ. 24 లక్షలు) ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top