ఆసీస్‌ అదుర్స్‌ | Finch 153 pilots Australia to 334 | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ అదుర్స్‌

Jun 15 2019 6:45 PM | Updated on Jun 15 2019 6:48 PM

Finch 153 pilots Australia to 334 - Sakshi

లండన్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. అరోన్‌ ఫించ్‌(153; 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీకి తోడు స్టీవ్‌ స్మిత్‌(73; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌(46 నాటౌట్‌; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)ల దూకుడు జత కలవడంతో ఆసీస్‌ 335 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ ఆరంభంలో కుదురుగా ఆడింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌-అరోన్‌ ఫించ్‌లు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌(26) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై ఖవాజా(10) కూడా నిరాశపరచడంతో ఆసీస్‌ 100 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది.
(ఇక్కడ చదవండి: ఫించ్‌ సరికొత్త రికార్డు)

ఆ తరుణంలో ఫించ్‌కు జత కలిసిన స్టీవ్‌ స్మిత్‌ తన సొగసైన ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ముందుగా ఫించ్‌ హాఫ్‌​ సెంచరీ పూర్తి చేసుకోగా, కాసేపటికి స్మిత్‌ కూడా అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలు సాధించిన తర్వాత ఆసీస్‌ స్కోరులో వేగం పుంజుకుంది. ప్రధానంగా ఫించ్‌ హార్డ్‌ హిట్టింగ్‌తో విరుచుకుపడితే, స్మిత్‌ చక్కటి టైమింగ్‌తో పరుగులు రాబట్టాడు.  ఈ జోడి మూడో వికెట్‌కు 173 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత ఫించ్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. మరో ఐదు పరుగుల వ్యవధిలో స్మిత్‌ సైతం ఔట్‌ కావడంతో ఆసీస్‌ 278 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఆ సమయంలో మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. వచ్చీ రావడంతోనే బౌండరీలే లక్ష్యంగా బ్యాట్‌ ఝుళిపించాడు. కాగా, చివర్లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా మెరుపులు మెరిపించడంతో ఆసీస్‌ స్కోరు మందగించింది. దాంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 పరుగుల చేసింది. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా, ఇసురా ఉదానాలకు తలో రెండు వికెట్లు లభించగా, లసిత్‌ మలింగా వికెట్‌ తీశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement