ఉరుగ్వే... ఉత్కంఠను అధిగమించి  

Fifa world cup:Uruguay beats Egypt  - Sakshi

1–0తో ఈజిప్ట్‌పై విజయం

ఏకైక గోల్‌ సాధించిన జిమినెజ్‌  

కఠినమైన పోటీని ఎదుర్కొన్నా, చివరి వరకు పైచేయి కాకున్నా, ఎదురుదాడి చేయలేకపోయినా, బంతిపై నియంత్రణతో, మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకొని ఉరుగ్వే గెలిచింది. ప్రపంచ కప్‌ వేటను నిదానంగా ప్రారంభిస్తుందని పేరున్న ఆ జట్టు... దానికి తగ్గట్లే భారీ తేడా ఏమీ లేకుండానే నెగ్గింది. కీలక ఆటగాడైన మొహమ్మద్‌ సలా గైర్హాజరీలో ఈజిప్ట్‌కు పోరాడామన్న సంతృప్తి మాత్రమే మిగిలింది.  

ఎకతెరినాబర్గ్‌: అద్భుతం అనదగ్గ ప్రదర్శనలు లేకుండా సాదాసీదాగా సాగిన మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై ఉరుగ్వేదే పైచేయి అయింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో గెలిచింది. 89వ నిమిషంలో ఉరుగ్వే డిఫెండర్‌ జిమినెజ్‌ కొట్టిన ఏకైక గోల్‌ రెండు జట్ల మధ్య తేడా చూపింది. ఉరుగ్వేకు ప్రపంచ కప్‌ తొలి పోరులో నెగ్గడం 48 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.  ఆధిపత్యం కోసం పోటాపోటీగా, మిడ్‌ ఫీల్డ్‌ సమరంలా సాగిన మ్యాచ్‌లో గోల్‌ కోసం ఇరు జట్లు శ్రమించాల్సి వచ్చింది. దాడి మొదలు పెట్టింది ఉరుగ్వేనే అయినా, ఈజిప్ట్‌ కూడా దీటుగా నిలిచింది. తొలి అరగంటలో డిఫెన్స్‌తో పాటు ప్రత్యర్థి ప్రధాన ఆటగాళ్లు లక్ష్యంగా ప్రతి దాడులు చేసింది. మొదటి గోల్‌ అవకాశం మాత్రం ఉరుగ్వే స్టార్‌ సురెజ్‌కే వచ్చింది.

కానీ, తక్కువ ఎత్తులో వచ్చిన క్రాస్‌ను అతడు సద్వినియోగం చేయలేకపోయాడు. ఒకింత ఒత్తిడితో ప్రారంభమైన రెండో భాగంలో ఉరుగ్వేకు కొంత మొగ్గు కనిపించగా ఈజిప్ట్‌కు ఆటగాళ్ల గాయాలు అనుకోని దెబ్బగా మారాయి. దాడుల తీవ్రత పెంచేందుకు ఆ జట్టు కోచ్‌ పలు మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే, సలా లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ అవేవీ గోల్‌ను చేర లేదు. ఈజిప్ట్‌ డిఫెన్స్‌ను గుక్క తిప్పుకోకుండా చేసిన సురెజ్, ఎడిన్సన్‌ కవానీలు అవకాశాలను చేజార్చడంతో మ్యాచ్‌ చివరకు డ్రా అయ్యేలా కనిపించింది. అయితే 89వ నిమిషంలో జిమినెజ్‌ మాయ చేశాడు. డిగో గొడిన్‌ ద్వారా కుడివైపు నుంచి దూసుకొచ్చిన ఫ్రీ కిక్‌ను ఒడుపుగా గోల్‌ పోస్ట్‌లోకి పంపి ఉరుగ్వే తరఫున ఖాతా తెరిచాడు. ఎప్పటిలానే రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యమిచ్చిన ఈజిప్ట్‌కు ఒక్క కార్నర్‌ కిక్‌ కూడా లభించకపోవడం, సలా గైర్హాజరీలో స్ట్రయికర్‌ మార్వన్‌ ఒంటరిగా మిగిలిపోవడం దెబ్బతీసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top