ఎదురులేని ఫెడరర్‌

Federer made to dig deep - Sakshi

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ ఫైనల్లోకి ప్రవేశం

వరుసగా 17వ విజయం

తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో ఫెడరర్‌ తొలిసారి ఓ సీజన్‌ను వరుసగా 17 విజయాలతో ప్రారంభించాడు. 2006 సీజన్‌ ఆరంభంలో వరుసగా 16 విజయాలు నమోదు చేయడమే ఇప్పటిదాకా అతని అత్యుత్తమ ప్రదర్శన. కానీ ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ఈ స్విట్జర్లాండ్‌ స్టార్‌ తన జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. రికార్డుస్థాయిలో ఆరో టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు.

కాలిఫోర్నియా: తన ప్రత్యర్థి నుంచి ఊహిం చని ప్రతిఘటన ఎదురైనా... అనుభవాన్నంతా రంగరించి పోరాడిన స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 49వ ర్యాంకర్‌ బోర్నా కొరిక్‌ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఫెడరర్‌ 5–7, 6–4, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌కు గట్టిపోటీనే లభించింది. తొలి సెట్‌ కోల్పోయిన ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ రెండో సెట్‌లో 2–4తో వెనుకబడ్డాడు. అయితే 20 ఏళ్లుగా అంతర్జాతీయ టెన్నిస్‌ ఆడుతోన్న ఫెడరర్‌ ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడుతూ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ 6–4తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు.

నిర్ణాయక మూడో సెట్‌లోనూ ఓ దశలో ఫెడరర్‌ 3–4 తో వెనుకబడ్డాడు. ఈసారీ ఎలాంటి ఒత్తిడి కి లోనుకాకుండా వరుసగా మూడు గేమ్‌లు సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ దక్కించుకున్నాడు. ఫైనల్లో యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ డెల్‌ పొట్రో (అర్జెంటీనా)తో ఫెడరర్‌ ఆడతాడు. ‘సెమీస్‌లో విజయం అంత సులువుగా లభించలేదు. కీలక సందర్భాల్లో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఈ తరహా మ్యాచ్‌లు నా కెరీర్‌లో చాలాసార్లు ఆడాను. ఓ సీజన్‌లో వరుసగా 17 విజయాలు దక్కడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇదే జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తాను’ అని 36 ఏళ్ల ఫెడరర్‌ వ్యాఖ్యానించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top