ఫెడరర్‌ మరో ఘనత

Federer is another honor - Sakshi

నాలుగోసారి బీబీసీ అత్యుత్తమ 

విదేశీ క్రీడాకారుడిగా ఎంపిక

ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు

లండన్‌: క్రీడాకారుడిగా తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ కోర్టు బయట కూడా తన పేరిట ఎన్నో ఘనతలు లిఖించుకున్నాడు. తాజాగా అవార్డుల విభాగంలోనూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) ప్రతీ ఏడాది అందించే క్రీడా పురస్కారాల్లో రోజర్‌ ఫెడరర్‌కు ‘విదేశీ అత్యుత్తమ క్రీడాకారుడు’ అవార్డు లభించింది. ఫెడరర్‌కు ఈ పురస్కారం లభించడం ఇది నాలుగోసారి. 2004, 2006, 2007లో ఈ అవార్డు గెల్చుకున్న ఫెడరర్‌ పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకోవడం విశేషం. 1960 నుంచి బీబీసీ ఈ అవార్డులు ఇస్తుండగా... బాక్సింగ్‌ దిగ్గజం మొహమ్మద్‌ అలీ (అమెరికా–1973, 1974, 1978)... మేటి అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ (జమైకా–2008, 2009, 2012) మూడుసార్లు చొప్పున ఈ పురస్కారం గెల్చుకున్నారు. ఆదివారం లివర్‌పూల్‌లో జరిగే కార్యక్రమంలో ఫెడరర్‌ ఈ అవార్డు అందుకుంటాడు. 

ఘనం... పునరాగమనం... 
గత ఏడాది వింబుల్డన్‌ టోర్నీ తర్వాత మోకాలి గాయంతో ఆరు నెలలపాటు ఫెడరర్‌ ఆటకు దూరమయ్యాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని కావాల్సినంత విశ్రాంతి  అనంతరం ఈ ఏడాది నూతనోత్సాహంతో బరిలోకి దిగాడు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్‌ నాదల్‌ను ఓడించి విజేతగా నిలిచి పెను సంచలనం సృష్టించాడు. తన పని అయిపోయిందని విమర్శించిన వారికీ తన రాకెట్‌తోనే బదులు ఇచ్చాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో మొదలైన ఫెడరర్‌ జోరు ఇండియన్‌ వెల్స్, మయామి మాస్టర్స్‌ టోర్నీల్లోనూ కొనసాగింది. ఈ రెండు టోర్నీల్లోనూ అతను విజేతగా నిలిచాడు. ఆ తర్వాత హాలే ఓపెన్‌లో... వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన ఈ స్విస్‌ స్టార్‌ షాంఘై మాస్టర్స్‌ సిరీస్‌... బాసెల్‌ ఓపెన్‌లోనూ టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఫెడరర్‌ 52 మ్యాచ్‌ల్లో గెలిచి కేవలం ఐదింటిలో ఓడాడు. 17 టోర్నీల్లో ఆడి 1,30,54,856 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 83 కోట్లు) సంపాదించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top