వన్డేలకు డుమినీ గుడ్‌ బై!

Duminy to retire from ODIs after 2019 World Cup - Sakshi

కేప్‌టౌన్‌: త్వరలో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలగబోతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినీ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించిన డుమినీ.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని పేర్కొన్నాడు. 2017లో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న డుమినీ, వన్డే ఫార్మాట్‌ నుంచి సైతం వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు వరల్డ్‌కప్‌ను ఎంచుకున్నాడు. వన్డేల్లో తనకు వరల్డ్‌కప్‌ చివరిదంటూ డుమినీ ప్రకటించాడు.

‘గత కొన్నినెలలుగా నా వన్డే రిటైర్మెంట్‌పై ఆలోచనలో పడ్డా. వన్డేలకు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చేసిందని బలంగా నమ్ముతున్నా. వరల్డ్‌కప్‌ తర్వాత తప్పుకోవడానికి సిద్ధమయ్యా. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సతమతమయ్యా. కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఇక వన్డేలు చాలనుకున్నా. అంతర్జాతీయ, దేశవాళీ టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతా’ అని డుమినీ తెలిపాడు. ఇప్పటివరకూ డుమినీ 193 వన్డేలు ఆడగా 37. 39 సగటుతో 5,047 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 68 వికెట్లు సాధించాడు. రాబోయే వరల్డ్‌కప్‌ డుమినీకి మూడోది. గతంలో 2011, 2015 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో డుమినీ పాల్గొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top