చెన్నై బ్యాట్స్‌మెన్‌పై ధోనీ ఫైర్‌..! | Dhoni lashes out at Chennai Super Kings batsmen | Sakshi
Sakshi News home page

చెన్నై బ్యాట్స్‌మెన్‌పై ధోనీ ఫైర్‌..!

May 8 2019 10:31 AM | Updated on May 8 2019 11:14 AM

Dhoni lashes out at Chennai Super Kings batsmen  - Sakshi

మ్యాచ్‌లో ధోనీ (ఫొటో: ఐపీఎల్‌ ట్విటర్‌ ఖాతా)

చెన్నై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్‌ జట్టు.. చెన్నై సూపర్‌కింగ్స్‌పై వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్‌ సాధించింది. మంగళవారం చెప్పాక్‌ మైదానంలో జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో చెన్నైను మట్టికరిపించి.. ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన చెపాక్‌ మైదానంలో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న సారథి ధోనీకి చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఒకింత షాక్‌ ఇచ్చారు. కీలకమైన ఈ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ పరుగులు చేయడంలో విఫలమవ్వడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (10), డుప్లెసిస్‌ (6) మరోసారి విఫలమవ్వగా.. సురేశ్‌ రైనా ఐదు పరుగులకే చేతులెత్తేశాడు. దీంతో భారీ పరుగులు రాబట్టాల్సిన పవర్‌ప్లేలో చెన్నై ఆచితూచి ఆడింది. చెప్పాక్‌ మైదానంలో పిచ్‌ పరిస్థితులు కూడా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించలేదు. 26 పరుగులు చేసి మురళి విజయ్‌ పెవిలియన్‌ బాట పట్టగా.. అంబటి రాయుడు (42), ధోనీ (37) తుదివరకు క్రీజ్‌లో నిలిచిన భారీ పరుగులు చేయలేకపోయారు. చెన్నై విసిరిన 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ ఆడుతూ పాడుతూ సునాయసంగా ఛేదించారు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన చెన్నై కెప్టెన్‌ ధోనీ జట్టు చెత్త బ్యాటింగ్‌పై, పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆడటంలో విఫలమవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. చావో-రేవో తేల్చుకోవాల్సిన రెండో క్వాలిఫైయర్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలంటే చెన్నై బ్యాటింగ్‌ మరింత మెరుగుపడాల్సిందేనని ధోనీ తేల్చి చెప్పారు.

‘ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే. కానీ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. ముఖ్యంగా బ్యాటింగ్‌ విషయంలో. హోమ్‌ పిచ్‌ పరిస్థితులను మేం త్వరగా పసిగట్టి ఉంటే బాగుండేది. ఇక్కడి పిచ్‌లో ఆరు, ఏడు గేమ్స్‌ ఆడాం. పిచ్‌ను బాగా అర్థం చేసుకొని.. హోం అడ్వాంటేజ్‌ తీసుకొని ఉండాల్సింది. పిచ్‌ ఎలా ప్రవర్తిస్తోంది? ట్యాకీగా ఉందా? బాల్‌ సరిగ్గా బ్యాటుపైకి వస్తుందా? అన్నది మేం తెలుసుకోవాల్సి ఉండేది. ఈ విషయాల్లో మేం వెనుకబడిపోయాం. బ్యాటింగ్‌ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది’ అని ధోనీ అన్నారు.

‘మా జట్టులో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. పలు మ్యాచ్‌ల్లో మేం బాగా బ్యాటింగ్‌ చేశాం. ఇప్పటివరకు వీరిమీద ఆధారపడుతూ వచ్చాం. వారికి అనుభవముంది. అయితే, పరిస్థితులు ఇంకా బాగా అర్థం చేసుకొని ఉండాల్సింది. నెక్ట్స్‌ గేమ్‌లో మేం బాగా ఆడుతామని భావిస్తున్నాం’ అని ధోనీ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం 131 పరుగులు చేయడంపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా తక్కువ స్కోరు అని పేర్కొన్నారు. ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా మ్యాచ్‌ కోల్పోయేలా చేశాయన్నారు. అయితే, తమకు ఫైనల్‌కు వెళ్లేందుకు ఇంకో అవకాశముండటం ఆనందం కలిగిస్తోందని, ఆ మ్యాచ్‌లో రాణించి.. ఫైనల్‌కు వెళ్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement