
ప్రత్యర్థి జట్ల వ్యూహాలను అంచనా వేస్తూ ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయడం కత్తి మీద సాము వంటింది
కోల్‌కతా : కీలక ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేలు గెలిచి కూడా సిరీస్ ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లి సేన వన్డే సిరీస్ ఓటమిపై టీమిండియా మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. ఈ ఓటమి కోహ్లి సేనకు ఓ హెచ్చరిక వంటిదని అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఈ ఓటమితోనేనై తమ చేసిన తప్పుల నుంచి ఆటగాళ్లు గుణపాఠాలు నేర్చుకుంటారని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా ఓటమిపై ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని చివరి రెండు వన్డేలకు లేకపోవడమే ఆసీస్‌కు వరమైందని అతడు అభిప్రాయపడ్డాడు.
‘ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో టీమిండియా గెలుపులో ధోని కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొహాలీ, ఢిల్లీ వన్డేల్లో ఆసీస్ గెలవడానికి ఏకైక కారణం టీమిండియాలో ధోని లేకపోవడమే. ఆ రెండు వన్డేల్లో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒక ఆసీస్ ఆటగాడిగా చెప్పాలంటే ధోని లేకపోవడం ఆసీస్‌కు వరమయింది. ప్రత్యర్థి జట్ల వ్యూహాలను అంచనా వేస్తూ ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయడం కత్తి మీద సాము వంటింది’అంటూ వార్నర్ పేర్కొన్నాడు.