ధోనికి సెల్యూట్‌ కొట్టిన కాట్రెల్‌

Cottrell Shares Video Of Dhoni Gives To His Country Beyond Duty - Sakshi

హైదరాబాద్‌: రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలన్న టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులతో సహా, టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్‌ గంభీర్‌, కపిల్‌ దేవ్ వంటి దిగ్గజాలు ధోని నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ ధోని తీసుకున్న నిర్ణయానికి ముగ్దుడయ్యాడు. అంతేకాకుండా అతడి దేశభక్తి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్‌ అందుకుంటున్న వీడియోని జతచేశాడు.  

‘మైదానంలో ధోని ఎంతో స్పూర్తినిస్తాడు. అతను గొప్ప దేశ భక్తుడు. దేశానికి సేవలందించాలన్న అతని అంకితభావం అమోఘం’అంటూ కాట్రెల్‌ తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు. అనంతరం మరో ట్వీట్‌లో ‘ఈ వీడియోని స్నేహితులు, కుటుంబ సభ్యులకి షేర్‌ చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోని, అతని భార్య సాక్షిని చూస్తేంటే జీవిత భాగస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది’అంటూ ధోని పద్మవిభూషణ్‌ తీసుకుంటున్న వీడియోను జతచేసి పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం కాట్రెల్‌ ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘మైదానంలో నువ్వు సెల్యూట్‌తో సంబరాలు చేసుకుంటే .. నీ ట్వీట్‌కు, మంచితనానికి మేమందరం సెల్యూట్‌ చేస్తున్నాం’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.   

కాగా, కాట్రెల్ కూడా జమైకా సైన్యంతో కలిసి పనిచేస్తూనే క్రికెట్‌ ఆడుతున్నాడు. దీంతో.. ఇప్పటికీ అతను మైదానంలో వికెట్ పడగొడితే..? సైనికుడి తరహాలో ఫీల్డ్ అంపైర్ వైపు వాక్ చేసి సెల్యూట్ కొట్టి సంబరాలు చేసుకుంటాడు. తాజాగా ధోనీకి కూడా గౌరవంగా ట్వీట్‌ ద్వారా సెల్యూట్ కొట్టాడు. తన రెండు నెలల సైనిక శిక్షణను ధోని గత గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జులై 31 నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా ధోని పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను నిర్వర్తించనున్నాడు.

This man is an inspiration on the cricket field. But he is also a patriot and a man that gives to his country beyond duty. I have been at home in Jamaica with my boys these past weeks and had time to reflect (1/2)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top