
చెన్నైకి షాక్
పోయిన పరువు కొంతైనా నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సత్తా చాటింది.
వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చెక్ పెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.... పాయింట్ల పట్టికలో ‘టాప్’లో ఉన్న ధోని సేనకు కీలక మ్యాచ్‌లో షాకిచ్చింది. బ్యాటింగ్ వైఫల్యంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన చెన్నై బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
రాయ్‌పూర్ : పోయిన పరువు కొంతైనా నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సత్తా చాటింది. జహీర్ ఖాన్ (2/9), ఆల్బీ మోర్కెల్ (2/21) బౌలింగ్ మెరుపులకు తోడు బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (49 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (28 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.
షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసింది. టాప్ స్కోరర్ డు ప్లెసిస్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు), ధోని (24 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్)తో సహా అందరూ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యారు. తర్వాత ఢిల్లీ 16.4 ఓవర్లలో 4 వికెట్లకు 120 పరుగులు చేసి నెగ్గింది. జహీర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
జహీర్ జోరు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని స్పిన్నర్ నదీమ్, పేసర్ జహీర్‌లు అద్భుతమైన బౌలింగ్‌తో అడ్డుకున్నారు. దీంతో ఓపెనర్లు స్మిత్ (24 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (21 బంతుల్లో 11; 1 ఫోర్) పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పవర్‌ప్లేలో 16 పరుగులు చేసిన చెన్నై.. మెకల్లమ్ వికెట్‌ను చేజార్చుకుంది. వన్‌డౌన్‌లో రైనా (11) విఫలంకాగా, స్మిత్ కూడా స్వల్ప వ్యవధిలో అవుటయ్యాడు. తర్వాత డు ప్లెసిస్, ధోనిలు నిలకడగా ఆడారు.
రన్‌రేట్ తక్కువగా ఉండటంతో భారీ షాట్లకు పోకుండా వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 27 పరుగులు జోడించారు. ఈ దశలో డు ప్లెసిస్ అవుటైనా.. ధోని, బ్రేవో (8) చెరో సిక్సర్ బాదడంతో కాస్త ఊపు వచ్చింది. అయితే 5 బంతుల తేడాలో ఈ జోడి పెవిలియన్‌కు చేరడంతో చెన్నై 110 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ధోని, బ్రేవోలు ఐదో వికెట్‌కు 22 పరుగులు సమకూర్చారు.
శ్రేయస్ నిలకడ
లక్ష్యం చిన్నదే అయినా ఢిల్లీ ఇన్నింగ్స్ తడబాటుతో మొదలైంది. ఓపెనర్లలో డికాక్ (3)తోపాటు కెప్టెన్ డుమిని (6) వరుస విరామాల్లో అవుట్ కావడంతో ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టిన శ్రేయస్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదగా, రెండో ఎండ్‌లో యువరాజ్ కూడా ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు. దీంతో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి.
తర్వాత కూడా ఈ ఇద్దరు జోరు కనబర్చడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. ఈ క్రమంలో శ్రేయస్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్‌లో నేగి బంతిని స్వీప్ చేయబోయి యువీ... మోహిత్ చేతికి చిక్కాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 9.1 ఓవర్లలో 69 పరుగులు జోడించడంతో ఢిల్లీ విజయానికి చేరువగా వచ్చింది. తర్వాత మోర్కెల్ (8) సమయోచితంగా ఆడాడు. గెలుపునకు 23 పరుగులు కావాల్సిన దశలో అయ్యర్ రెండు ఫోర్లు కొట్టగా, మోర్కె ల్ భారీ సిక్స్ కొట్టి ఆ వెంటనే అవుటయ్యాడు. చివరకు జాదవ్ (1 నాటౌట్)తో కలిసి శ్రేయస్ జట్టుకు విజయాన్ని అందించాడు.
4 ఈ ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ చేసిన అర్ధ సెంచరీలు
5 ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఢిల్లీ నెగ్గిన మ్యాచ్‌ల సంఖ్య
19 ఈ మ్యాచ్‌లో జహీర్ ఖాన్ వేసిన డాట్ బాల్స్
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 18; మెకల్లమ్ (సి) డుమిని (బి) జహీర్ 11; రైనా (సి) డుమిని (బి) జయంత్ 11; డు ప్లెసిస్ (బి) మోర్కెల్ 29; ధోని (సి) నదీమ్ (బి) జహీర్ 27; బ్రేవో (సి) డుమిని (బి) సంధూ 8; నేగి నాటౌట్ 5; జడేజా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 119.
వికెట్ల పతనం: 1-16; 2-34; 3-46; 4-83; 5-105; 6-110.
బౌలింగ్: నదీమ్ 4-1-18-0; జహీర్ 4-1-9-2; సంధూ 4-0-33-1; మోర్కెల్ 3-0-21-2; జయంత్ 2-0-8-1; యువరాజ్ 3-0-23-0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అశ్విన్ (బి) పాండే 3; శ్రేయస్ నాటౌట్ 70; డుమిని (బి) పాండే 6; యువరాజ్ (సి) మోహిత్ (బి) నేగి 32; మోర్కెల్ (సి) పాండే (బి) నేగి 8; జాదవ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం: (16.4 ఓవర్లలో 4 వికెట్లకు) 120.
వికెట్ల పతనం: 1-16; 2-24; 3-93; 4-114.
బౌలింగ్: ఈశ్వర్ పాండే 4-1-27-2; మోహిత్ 2-0-17-0; అశ్విన్ 4-0-24-0; జడేజా 2.4-0-16-0; రైనా 1-0-8-0; నేగి 3-0-28-2.