చాహల్‌ మళ్లీ నోబాల్‌ వేశాడా!!

Chahal takes david miller wicket again - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఐదో వన్డేలో లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహాల్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో డేవిడ్‌ మిల్లర్‌ మరోసారి విఫలమయ్యాడు. చాహల్‌ బంతిని కొట్టేందుకు మిల్లర్‌ ముందుకొచ్చాడు.. అనూహ్యంగా బంతి గింగిరాలు తిరుగుతూ లెగ్‌ స్టంప్‌ను ఢీకొట్టింది. అయినా వెంటనే పెవిలియన్‌ వెళ్లేందుకు మిల్లర్‌ తటపటాయించాడు. మళ్లీ ఏదైనా లక్కు కలిసివస్తుందన్న ఆశ అతనిలో ఉందేమో.. ఒకింత నిరాశగా, ఒకింత సంశయంగా పదేపదే స్కోరు బోర్డును చూస్తూ అతను పెవిలియన్‌ బాట పట్టాడు.

బౌల్డ్‌ అయిన మిల్లర్‌ ఇలా తటపటాయిస్తూ.. సంశయిస్తూ పెవిలియన్‌కు చేరడం వెనుక కారణం నాలుగో వన్డే. జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ వన్డేలో మిల్లర్‌కు అనూహ్యంగా లైఫ్‌ దొరికింది. చాహల్‌ వేసిన బంతిని మిల్లర్‌ అంచనా వేయడంలో ఇలాగే విఫలయ్యాడు. ఏడు పరుగుల వద్ద అతను బౌల్డ్‌ అయ్యాడు. అయితే, చాహల్‌ నిర్లక్ష్యం కారణంగా అది నోబాల్‌ కావడంతో మిల్లర్‌కు లైఫ్‌ దొరికింది. టీమిండియాకు మ్యాచ్‌ పోయింది. ఇలా లైఫ్‌ అందుకున్న మిల్లర్‌ చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతనికి హెన్రిక్‌ క్లాసెన్‌ (27 బంతుల్లో 43) జతకలువడంతో నాలుగో వికెట్‌కు ఈ జోడీ 41 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఈ భాగస్వామ్యం వర్షంతో కుదించబడిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికాకు విజయం చేకూర్చింది. మ్యాచ్‌ కీలక దశలో నోబాల్‌ వేసి.. వికెట్‌ అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకున్న చాహల్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌరవ్‌ గంగూలీ, సునీల్‌ గవాస్కర్‌ అతని తీరుపై మండిపడ్డారు.

ఈ మ్యాచ్‌ నుంచి గుణపాఠం నేర్చుకున్న చాహల్‌ ఐదో వన్డేలో చాలా బుద్ధిగా బౌలింగ్‌ చేశాడు. తప్పులకు తావు ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4 వికెట్లు), చాహల్‌ (రెండు వికెట్లు) అద్భుతంగా రాణించారు. గత మ్యాచ్‌లో మిల్లర్‌ విషయంలో పొరపాట్లు చేసిన చాహల్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా అతన్ని బోల్తా కొట్టించాడు. అతన్ని బౌల్డ్‌ చేసిన చాహల్‌.. నోరు మూసుకో అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top