
తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి ముంబై ఇండియన్స్‌ను ఆలోచనలో పడేసి ఉంటుంది. మ్యాచ్ అంత పోటాపోటీగా సాగకపోయి ఉంటే దాన్నుంచి తెలుసుకోవాల్సింది ఏమీ ఉండకపోయేది. డ్వేన్ బ్రేవో ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ లేదా ఒక బౌలర్ అద్భుత బౌలింగ్ ఫలితాన్ని మార్చేయడం తరచూ జరిగేదే. తమ బ్యాటింగ్ లైనప్‌తో ముంబై కనీసం 200 పరుగులైనా చేయాలి. తర్వాత బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించాలి. కానీ మొదటి మ్యాచ్‌లో బ్రేవో దెబ్బకు వారి ప్రధాన బౌలర్ బుమ్రా భారీగా పరుగులిచ్చుకున్నాడు. మంచి బౌలర్లకూ ఇలాంటిది సాధారణమే. అయినా అతడు ఓవర్ స్టెప్పింగ్ నో బాల్స్ నిరోధంపై దృష్టిపెట్టాలి. టెస్టుల్లో వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు కాబట్టి నో బాల్స్ వేశారంటే అర్థం చేసుకోవచ్చు. బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించేందుకు ఫ్లాట్ పిచ్‌లపైనా పేసర్లు కొన్నిసార్లు క్రీజు దాటుతుంటారు. పరుగులు నిరోధించడమే లక్ష్యమైన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇలా కాకుండా చూసుకోవడం పేసర్లకు అతి ముఖ్యం.
నో బాల్ అదనపు పరుగు మాత్రమే ఇవ్వదు. దానితో వచ్చే ఫ్రీ హిట్ ఫలితాన్నే మార్చేస్తుంది. బుమ్రా తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే ఆటగాడు. పరిమిత ఓవర్ల నుంచి టెస్టు క్రికెట్‌కు అతడి పయనం అసాధారణం. ఇదే విధంగా ‘నో బాల్’ సమస్యను ఎందుకు సరిచేసుకోలేకపోతున్నాడో అర్థం కావడం లేదు. రనప్ మార్కింగ్‌కు టేపుల వంటి చిట్కాలు ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఓవర్ ఫుట్ నోబాల్‌కు మినహాయింపుల్లేవు. ప్రారంభ మ్యాచ్‌లో రాజస్తాన్‌ను కట్టడి చేసిన తమ బౌలర్లు మళ్లీ రాణించాలని సన్‌రైజర్స్ భావిస్తుండవచ్చు. అయితే, ఐపీఎల్‌లో నెమ్మదిగా ఊపందుకునే స్వభావమున్న ముంబై పరిస్థితులను చక్కగా తమవైపు తిప్పుకోగలదు.