చెన్నై చమక్‌ 

Bravo Overshadows Pandya Brothers as Chennai Super - Sakshi

మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించిన బ్రేవో

ఐపీఎల్‌–11కు అదిరే ఆరంభం  

ఐపీఎల్‌ సీజన్‌ తొలి పోరు. తలపడుతున్నది దిగ్గజ జట్లు. అటు ఇటు మంచి హిట్టర్లు. అయినా సాదాసీదా ప్రదర్శన. ‘ఇదేం ఆట’ అంటూ నిట్టూర్పులో అభిమానులు! కానీ ఒకే ఒక్కడు మలుపు తిప్పాడు. ప్రేక్షకులను రంజింపజేశాడు. పేలవంగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చాడు. ఓటమి ఖాయమనుకున్న తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతడే డ్వేన్‌ బ్రేవో. అతడి దెబ్బకు ముంబై విసిరిన లక్ష్యం ‘బ్రేవ్‌ బ్రేవ్‌’మంటూ కరిగిపోయింది. చెన్నైకు అనూహ్య గెలుపు దక్కింది.  

ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఘన పునరాగమనం. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన డ్వేన్‌ బ్రేవో (0/25), అనంతరం బ్యాటింగ్‌ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)లోనూ విరుచుకుపడటంతో శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్‌–11వ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు వికెట్‌ తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై... సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (22 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. బ్రేవో దూకుడుతో చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. బ్రేవోకే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు వాట్సన్‌ (16), రాయుడు (22) చెన్నై ఇన్నింగ్స్‌ను కొంత మెరుగ్గానే ఆరంభించారు.

వీరితో పాటు రైనా (4), ధోని (5) తర్వగా అవుటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ముందుగా వచ్చిన జడేజా (12) నిరాశపరిచాడు. ఈలోగా కేదార్‌ జాదవ్‌ (22 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బ్రేవో ధైర్యంగా ఆడాడు. చివరి 3 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో రెండే వికెట్లున్నాయి. మెక్లనగన్‌ వేసిన 18వ ఓవర్లో బ్రేవో రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో, బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 3 సిక్స్‌లు సహా 20 చొప్పున పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్‌ చివరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా తిరిగి క్రీజులోకి వచ్చిన జాదవ్‌... ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ముగించాడు. అంతకుముందు ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. సినీ తారలు హృతిక్‌ రోషన్, ప్రభుదేవా, వరుణ్‌ ధావన్, జాక్‌లిన్‌ ఫెర్నాండెజ్, తమన్నాలు ప్రత్యేక నృత్యాలతో అలరించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top