భారత జట్లకు ఎదురుగాలి | Beach Volleyball in Visakhapatnam | Sakshi
Sakshi News home page

భారత జట్లకు ఎదురుగాలి

Mar 2 2019 7:19 AM | Updated on Mar 2 2019 7:19 AM

Beach Volleyball in Visakhapatnam - Sakshi

హోరాహోరీగా తలపడుతున్న జట్లు

విశాఖ స్పోర్ట్స్‌: వరల్డ్‌ టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు మహిళా విభాగంలో వెనిజులా చేరుకుంది.  విశాఖ సాగరతీరంలో శుక్రవారం జరిగిన ప్రధాన రౌండ్‌ డి పూల్‌ మ్యాచ్‌లలో వెనిజులాకు చెందిన మిల్లర్‌ పాట–హ్రేయషిన్‌ టోకో జోడీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది.  వీరి జోడీ లీగ్‌ తొలి మ్యాచ్‌లో  రష్యాకు చెందిన ఫిలినా–జగిగిన జోడీపైన ఏకపక్షంగా 2–0సెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన అలియే–ఫాచిస్‌ జోడీపై మరోసారి ఏకపక్షంగా 2–0తో విజయం సాధించి పూల్‌లో ఆధిక్యంలోకి చేరింది. అమెరికా క్రీడాకారిణుల జంట తొలి మ్యాచ్‌లో బారత్‌కు చెందిన యోగేశ్వరి పెరుమాళ్‌–గోపి జెన్నిఫర్‌పై 2–0 సెట్ల తేడాతో గెలిచి లీగ్‌ రెండో రౌండ్‌కు చేరింది. రష్యా జోడీ 2–0తో భారత్‌ పై విజయం సాధించింది. దీంతో అమెరికా, రష్యా జట్లు చెరో మ్యాచ్‌ విజయంతో కొనసాగినా ప్రత్యర్ధి జట్టుకు తక్కువ పాయింట్లు(58) ఇవ్వడంతో పూల్‌లో రెండో స్థానానికి చేరుకోగలిగింది. అమెరికా జట్టు ప్రత్యర్థులకు 64 పాయింట్లు ఇచ్చేసుకోవడంతో మూడో స్థానంలో నిలిచి పూల్‌లో చివరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమౌతుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ముఖాముఖీ తలపడనుండటంతో విజేత క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించనుంది. ఇక భారత్‌ పూల్‌లో చివరిదైన నాలుగో స్థానంలోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు మూడో మ్యాచ్‌ పూల్‌ విజేత వెనిజులాతో నామమాత్రపు పోటీలో ఆడనుంది. 

రామ–ఆరోన్‌కు విజయం
భారత్‌ తరపున ఆరుజట్లు మెయిన్‌ డ్రాలో ఆడుతుండగా లీగ్‌ తొలి రౌండ్లలో మూడు మహిళల జట్లు ఓటమి పాలయ్యాయి. పురుషుల విభాగంలో మాత్రం ఓ జట్టు ముందంజ వేసింది. రామా దవేస్కర్‌–ఆరోన్‌ పెరీరా జోడీ హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన కింగ్‌స్లే టే – యాంగ్‌ షెన్‌ జోడీపై గెలుపొందింది. ఈ జట్టు తొలిసెట్‌ను కోల్పోయినా తర్వాత రెండు సెట్లలో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరే ఆశలను సజీవంగా ఉంచుకుంది.  ఇక మహిళల బి పూల్‌లో ఆడిన నిరంజన–సుబ్రజా జోడీ 0–2తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బొమిరోవ–మైక్సినిరోవ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పూల్‌ఏలో ఆడుతున్న క్రిష్టి దియాస్‌–స్టెఫీ ఫెర్నాండెజ్‌ జోడీ 0–2తో జపాన్‌కు చెందిన చియో–సాకగుచి జోడీ చేతిలో పరాజయం పాలైంది.  ఇక పురుషుల ఏ పూల్‌లో భారత్‌కు చెందిన దావస్కర్‌–అనిల్‌ జోడీ హోరాహోరీగా తలపడినా చివరికి 1–2 సెట్ల తేడాతో ఐర్లాండ్‌కు చెందిన వకిలి–సలేమి జోడీ చేతిలో పరాజయం పాలైంది. ‘డి’పూల్‌లో ఆడిన భారత్‌కు చెందిన నరేష్‌–రాజు జోడీ 0–2 సెట్ల తేడాతో రష్యాకు చెందిన గొల్డ్‌స్మిత్‌– విలియమ్స్‌ జోడీ చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement