కోచ్‌, కెప్టెన్‌లపై బీసీసీఐ ఆగ్రహం!

BCCI Serious On Captain Kohli And Head Coach Shastri - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా వైఫల్యంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో జట్టు ఘోర పరాభావంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలను వివరణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ‘అసలు మైదానంలో ఏం జరుగుతోంది. మైదానంలో ఆటగాళ్ల క్రమశిక్షణరాహిత్యం ఏంటి? ఆటగాళ్లంతా ఒక్కదగ్గరే ఎందుకు ఉండటం లేదు? కొంత మంది టీమ్‌ బస్సులో మరికొంత మంది ట్రైన్‌లో రావడం ఏమిటి? జట్టు స్పూర్తి ఎక్కడికి పోయింది? ఇవి ఇలానే కొనసాగితే జట్టు పరిస్థితి ఏంటని’ ఆందోళన వ్యక్తం చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 

కోహ్లి కెప్టెన్సీపై..
సొంత నిర్ణయాలు తీసుకునే కెప్టెన్‌ కోహ్లికి అధికారం ఇవ్వడంపై కూడా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. మూడో టెస్ట్‌ ఫలితం ఆధారంగా కోచ్‌, కెప్టెన్‌లను బోర్డు వివరణ కోరనుందన్నారు. చివరి రెండు టెస్టులకు ఇంకా జట్టును ప్రకటించని విషయం తెలిసిందే.  జట్టు ఎంపికలో కోచ్‌, కెప్టెన్‌లకు పూర్తి స్వేచ్చ ఇవ్వడంపై కూడా తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ అనుభవం నేపథ్యంలో ముందుగా వెళ్లి సన్నద్ధమవుతామని జట్టు అడిగితే బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. కోరినట్లుగా ముందు టి20లు, ఆ తర్వాత వన్డేలు ముగిశాక టెస్టు సిరీస్‌ ఆడతామంటే ప్రత్యర్థి అయినా ఇంగ్లండ్‌ బోర్డు కూడా షెడ్యూల్‌ను దానికి అనుగుణంగా మార్చింది. కొందరు సీనియర్‌ ఆటగాళ్లను సైతం ఏ జట్టుతో పంపించింది. అయితే ఫలితం మాత్రం దక్కలేదు. వీటిపై కూడా టీమ్‌ను నిలదీసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

అనూహ్య మార్పులు..
ప్రస్తుతం కోహ్లి సారథ్యంలోని టీమిండియా కఠిన పరిస్థితులు ఎదుర్కుంటోంది. రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న కోహ్లి మూడో టెస్టు ఆడటంపై అనుమానం నెలకొంది. ఇదే జరిగేతే బోర్డు చివరి రెండు టెస్టులకు జట్టులో అనూహ్య మార్పులు చేయనుంది. ఇక మూడో టెస్ట్‌ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది.

చదవండి: గెలిపించేదెవరు..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top