వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

BCCI Might Consider Split Captaincy - Sakshi

ముంబై : చెత్త బ్యాటింగ్‌ సెలక్షన్‌, మిడిలార్డర్‌ వైఫల్యం, ఎప్పటి నుంచో వెంటాడిన ‘నాలుగో’ సమస్య సమస్యగానే మిగలడం ప్రపంచకప్‌లో భారత్‌ నిష్క్రమణకు కారణమయ్యాయి. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన.. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తడబడి కోట్లాది ప్రజల ఆశలను సమాధి చేసింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో భారత జట్టులో గ్రూప్‌ తగదాలు నెలకొన్నాయని, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మధ్య గ్యాంగ్‌ వార్‌ నడుస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కోహ్లి కెప్టెన్సీని టెస్ట్‌ ఫార్మట్‌కు పరిమితం చేసి.. లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలను రోహిత్‌శర్మకు అప్పగించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

ఈ ప్రపంచకప్‌ నేర్పిన గుణపాఠాలతో భారత్‌ తదుపరి ప్రపంచకప్‌ సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మకు లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలు అప్పగించి, టెస్టుల్లో కోహ్లిని కొనసాగించే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు బోర్డు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 

‘వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి రోహిత్‌కిదే సరైన సమయం. ప్రస్తుత కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌కు అందరి మద్దతు ఉంది. కానీ, తదుపరి ప్రపంచకప్‌కు ప్రణాళికలు రచించుకోవాలి. అందుకోసం పాత వ్యూహాలు, ప్రణాళికలను పక్కన పెట్టాలి. జట్టులో కొన్ని విషయాల్లో మార్పు అవసరమని మనందరికి తెలుసు. లిమిటెడ్‌ ఓవర్స్‌ కెప్టెన్సీకి రోహితే సరైనవాడు’ అని ఆ అధికారి అభిప్రాయపడ్డాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సైతం రోహిత్‌ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. ‘ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌ శర్మకు అప్పగించే సమయం వచ్చేసిందా? నేనైతే.. రోహితే 2023 ప్రపంచకప్‌కు సారథ్యం వహించాలనుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశాడు. 

ఇక ఇద్దరు కెప్టెన్ల డిమాండ్‌ ఇప్పుడే రాలేదు. ఆసియాకప్‌, నిదహాస్‌ టోర్నీల్లో రోహిత్‌సేన విజయం సాధించినప్పుడే ఈ వాదన తెరపైకి వచ్చింది. రోహిత్‌ సారథ్య రికార్డు కోహ్లి కన్నా మెరుగ్గా ఉండటంతో ఈ డిమాండ్‌ వ్యక్తమైంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సమీక్షించాలని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి త్వరలోనే జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలతో సీఓఏ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ సమావేశంలో ఇద్దరు కెప్టెన్ల అంశం చర్చకు రానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top