సన్‌రైజర్స్‌ బౌలర్‌ చెత్త రికార్డు!

Basil Thampi Records Most Expensive Spell in IPL - Sakshi

దారుణంగా పరుగులిచ్చిన బాసిల్‌ థంపి

14 పరుగులతో సన్‌రైజర్స్‌ ఓటమి

బెంగళూరు: అద్భుత బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ప్లే ఆఫ్‌ చేరిన సన్‌రైజర్స్‌ గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. తమ బలమైన బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనే విఫలమై ఈ సీజన్‌లో నాలుగో ఓటమిని చవిచూసింది. ఇక సన్‌ యువబౌలర్‌ బాసిల్‌ థంపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. సన్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన థంపి.. వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఇప్పటికి వరకు ఇషాంత్‌ శర్మ పేరు మీద ఉన్న ఈ చెత్తరికార్డును బ్రేక్‌ చేశాడు. 2013 సీజన్‌లో ఇషాంత్‌ 66 పరుగులిచ్చాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా తాజాగా థంపి అధిగమించాడు. ఇషాంత్‌ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ (0/65), సందీప్‌ శర్మ(1/65), వరుణ్‌ ఆరోన్‌ (2/63), అశోక్‌ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన జాబితాలో ఉన్నారు.

ఏబీ డివిలియర్స్‌ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్‌ (17 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరు 218 పరుగులు భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఈ లక్ష్య చేధనలో ఏమాత్రం తడబడని సన్‌రైజర్స్‌ చివరి వరకు పోరాడి ఆకట్టుకుంది.  కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడవరకు పోరాడినా విజయం బెంగళూరునే వరించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top