బజరంగ్‌ పసిడి పట్టు 

Bajrang Punia wins 65 kg gold; India finish with 3 medals on day one - Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌

ప్రవీణ్‌కు రజతం, సత్యవర్త్‌కు కాంస్యం

జియాన్‌ (చైనా): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటుకున్నాడు. రెండోసారి ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న బజరంగ్‌ తన ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆసియా చాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు. సయాత్‌బెక్‌ ఒకాసోవ్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన ఫైనల్లో బజరంగ్‌ 12–7 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఒకదశలో 2–7తో వెనుకబడిన ఈ హరియాణా రెజ్లర్‌ ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి ఒకాసోవ్‌ పని పట్టాడు. రెండో విరామంలో పూర్తిగా దూకుడుగా వ్యవహరించిన బజరంగ్‌ తన ప్రత్యర్థిపై పట్టు సంపాదించి వరుసగా పది పాయింట్లు సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు బజరంగ్‌ సెమీఫైనల్లో 12–1తో సిరాజుద్దీన్‌ ఖసనోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 6–0తో పీమన్‌ బియాబాని (ఇరాన్‌)పై, తొలి రౌండ్‌లో 10–0తో దివోషాన్‌ చార్లెస్‌ ఫెర్నాండో (శ్రీలంక)పై గెలుపొందాడు. 

సీజన్‌లో రెండో స్వర్ణం... 
గత ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన బజరంగ్‌... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో డాన్‌ కొలోవ్‌ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం నెగ్గి సీజన్‌లో శుభారంభం చేసిన అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పట్టుతో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది రెండో స్వర్ణం. 2017లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. అంతేకాకుండా ఈ టోర్నీ చరిత్రలో రెండు కాంస్యాలు (2018లో 65 కేజీలు; 2013లో 60 కేజీలు), ఒక రజతం (2014లో 61 కేజీలు) కూడా సాధించాడు.  మరోవైపు పురుషుల 79 కేజీల విభాగంలో ప్రవీణ్‌ రాణా రజతం, 97 కేజీల విభాగంలో సత్యవర్త్‌ కడియాన్‌ కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో ప్రవీణ్‌ రాణా 0–3తో బామన్‌ మొహమ్మద్‌ తెమూరి (ఇరాన్‌) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో సత్యవర్త్‌ 8–2తో హావోబిన్‌ గావో (చైనా)పై గెలుపొందాడు. 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవి కుమార్‌ 3–5తో ప్రపంచ మాజీ చాంపియన్‌ యూకీ తకహాషి (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. 70 కేజీల విభాగంలో రజనీశ్‌ తొలి రౌండ్‌లో 0–11తో యూనస్‌ అలీఅక్బర్‌ (ఇరాన్‌) చేతిలో ఓడిపోయాడు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top