పాకిస్తాన్‌ పోటీ ఇవ్వగలదా? | Australia v Pakistan 1st Test, Brisbane | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ పోటీ ఇవ్వగలదా?

Dec 15 2016 1:47 AM | Updated on Sep 4 2017 10:44 PM

పాకిస్తాన్‌ పోటీ ఇవ్వగలదా?

పాకిస్తాన్‌ పోటీ ఇవ్వగలదా?

ఒకవైపు వరుసగా ఐదు టెస్టు పరాజయాల తర్వాత కోలుకొని కీలక విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు...

నేటినుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్టు  
బ్రిస్బేన్‌లో తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌  


బ్రిస్బేన్‌: ఒకవైపు వరుసగా ఐదు టెస్టు పరాజయాల తర్వాత కోలుకొని కీలక విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు... మరోవైపు కివీస్‌ చేతిలో వరుసగా రెండు పరాజయాల తర్వాత ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన పాకిస్తాన్‌... గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో తమ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నేటినుంచి బ్రిస్బేన్‌లోని ‘గాబా’ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో ఇదే తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు కావడం విశేషం. గతంలో సొంతగడ్డపై అడిలైడ్‌లో జరిగిన రెండు డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లలోనూ ఆసీస్‌ విజయం సాధించగా, యూఏఈలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో పాక్‌ కూడా గెలుపొందింది.

ఆస్ట్రేలియాపై పాకిస్తాన్‌కు పేలవ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 11 సిరీస్‌లలో ఆ జట్టు ఎప్పుడూ గెలవలేదు. ముఖ్యంగా గత మూడు సిరీస్‌లలో అయితే వరుసగా 0–3 తేడాతో మొత్తం 9 టెస్టులు ఓడింది. మరోవైపు గాబా స్టేడియంలో ఆస్ట్రేలియా 1988 నుంచి ఓడిపోలేదు. ఇన్నేళ్లలో ఆడిన 27 టెస్టుల్లో ఆ జట్టు 20 గెలిచి 7 డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో మొగ్గు ఆసీస్‌ వైపే ఉంది. అయితే తొలిసారి డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో ఇక్కడ గులాబీ బంతి ఎలా స్పందిస్తుందనేదానిపై ఇరు జట్లకూ సందేహాలు ఉన్నాయి. పేసర్లు వహాబ్‌ రియాజ్, ఆమిర్‌లపై ఆధారపడుతున్న పాకిస్తాన్‌కు బ్యాటింగే పెద్ద సమస్య. బౌలర్లు రాణించినా ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోగలరా అనేదే సమస్య. ఈ సిరీస్‌లో కూడా సీనియర్లు మిస్బావుల్‌ హక్, యూనిస్‌ఖాన్‌లే జట్టు భారం మోస్తున్నారు.

గతంలో షేన్‌వార్న్‌ అద్భుతంగా రాణించిన ఈ మైదానంలో పాక్‌ తమ లెగ్‌స్పిన్నర్‌ యాసిర్‌ షాపై కూడా ఆశలు పెట్టుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికాపై చివరి టెస్టు గెలిచిన ఉత్సాహంలో ఆసీస్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది.  సొంతగడ్డపై ఈ సిరీస్‌ నెగ్గి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని స్మిత్‌ సేన పట్టుదలగా ఉంది. ఉస్మాన్‌ ఖాజా, వార్నర్‌ అద్భుత ఫామ్‌లో ఉండగా, పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌ ప్రత్యర్థిని కుప్పకూల్చగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement