ఆసీస్‌దే విజయం

Australia Beat Srilanka by 87 Runs - Sakshi

లండన్‌ : వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను 247 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా మరో గెలుపును అందుకుంది.  ఈ టోర్నీలో ఇది ఆసీస్‌కు నాల్గో విజయం కాగా, లంకకు రెండో ఓటమి. తాజా మ్యాచ్‌లో శ్రీలంకకు దిముత్‌ కరుణరత్నే(97), కుశాల్‌ పెరీరా(52) మంచి ఆరంభాన్నిచ్చినా భారీ లక్ష్యం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. 

అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టులో అరోన్‌ ఫించ్‌(153; 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు. అతనికి తోడు స్టీవ్‌ స్మిత్‌(73; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌(46 నాటౌట్‌; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)ల దూకుడు కూడా జత కలవడంతో ఆసీస్‌ 335 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌-అరోన్‌ ఫించ్‌లు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌(26) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై ఖవాజా(10) కూడా నిరాశపరచడంతో ఆసీస్‌ 100 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో ఫించ్‌కు జత కలిసిన స్టీవ్‌ స్మిత్‌ తన సొగసైన ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలోనే ముందుగా ఫించ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, కాసేపటికి స్మిత్‌ కూడా అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలు సాధించిన తర్వాత ఆసీస్‌ స్కోరులో వేగం పుంజుకుంది. ప్రధానంగా ఫించ్‌ హార్డ్‌ హిట్టింగ్‌తో విరుచుపడితే, స్మిత్‌ చక్కటి టైమింగ్‌తో పరుగులు రాబట్టాడు.  ఈ జోడి మూడో వికెట్‌కు 173 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత ఫించ్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. మరో ఐదు పరుగుల వ్యవధిలో స్మిత్‌ సైతం ఔట్‌ కావడంతో ఆసీస్‌ 278 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఆ సమయంలో మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. వచ్చీ రావడంతో బౌండరీలే లక్ష్యంగా బ్యాట్‌ ఝుళిపించాడు. కాగా, చివర్లో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌ కూడా మెరుపులు మెరింపించడంతో ఆసీస్‌ స్కోరు మందగించింది. దాంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 పరుగుల చేసింది. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా, ఇసురా ఉదానాలకు తలో రెండు వికెట్లు లభించగా, లసిత్‌ మలింగా వికెట్‌ తీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top