అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయమే ఫైనల్‌

Apex Council decision is final, says HCA acting president Anil Kumar - Sakshi

హెచ్‌సీఏ ఇన్‌చార్జ్‌ అధ్యక్షుడు అనిల్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ఎవ్వరికీ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అధికారంలేదని, అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయమే ఫైనల్‌ అని హెచ్‌సీఏ ఇన్‌చార్జ్‌ అధ్యక్షుడు కె.అనిల్‌ కుమార్‌ అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు కాదని సెక్రటరీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల యువ క్రికెటర్లకు ఎంతో ఇబ్బంది అవుతోందని ఆయన పేర్కొన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోకుండా జోనల్‌ టోర్నమెంట్లు ప్రకటించడం తప్పు అని, ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతుండగా జోనల్‌ మ్యాచ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడం సరికాదన్నారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పాండురంగ మూర్తి, కోశాధికారి మహేంద్రతో కలిసి మాట్లాడుతూ... ఇటీవల అపెక్స్‌ కమిటీలో నిర్ణయించిన సెలెక్షన్‌ కమిటీ పంపిన జట్టుతోపాటు, సెక్రటరీ మరో జట్టును కర్ణాటకకు పంపడంతో రెండు జట్లనూ ఆడనివ్వలేదని, దీంతో యువ క్రికెటర్లు ఎంతో నిరాశకు గురయ్యారని గుర్తుచేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకే సెక్రటరీ, అధ్యక్షులు అందరూ పనిచేయాలని సెక్రటరీ సొంతంగా ఏర్పాటు చేసిన జోనల్‌ కమిటీలు చెల్లవని ఈ విషయాన్ని క్రికెటర్ల తల్లిదండ్రులు గ్రహించాలని తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top