అంతర్జాతీయ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన  | Anil Kumble unveils CK Nayudus statue in Machilipatnam | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన 

Jul 25 2018 1:00 AM | Updated on Jul 28 2018 6:35 PM

Anil Kumble unveils CK Nayudus statue in Machilipatnam - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: విజయవాడలోని విద్యాధరపురంలో రూ.60 కోట్లతో నిర్మించే ‘అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌’కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు పతకం సాధించేందుకు పాఠశాల స్థాయి నుంచి ఎంపిక చేసే గాండీవ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్వహణకు భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లేకు చెందిన టెన్విక్‌ సంస్థతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా పాంచజన్య ప్రాజెక్టు పేరుతో విశాఖపట్నం, నెల్లూరు, నర్సారావుపేట, గుడివాడ, అనంతపురంలో ఏర్పాటు చేసిన శాప్‌ స్పోర్ట్స్‌ అకాడమీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టెన్విక్‌ సంస్థ అధినేత అనిల్‌ కుంబ్లే, ఒలింపియన్లు, అర్జున, ద్రోణాచార్య అవార్డీలు కరణం మల్లేశ్వరి, షైనీ విల్సన్, అశ్వని నాచప్ప, సత్తి గీత, కోనేరు హంపి, కోనేరు అశోక్, రీత్‌ అబ్రహాం, సెయిలర్‌ పి.స్వాతి తదితరులు పాల్గొనగా వారిని సీఎం చంద్రబాబు ఘనంగా సన్మానించారు.   ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచాన్ని జయించే శక్తి క్రీడాకారులకు ఉందన్నారు. భారత దేశంలో క్రీడల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామని,  ఉత్తమ శిక్షణ ఇచ్చే కోచ్‌లను తీసుకొస్తామన్నారు.   

ఆర్చర్‌ డాలీ శివానికి 25 లక్షల నజరానా... 
వండర్‌ కిడ్‌ ఆర్చర్‌ డాలీ శివానిని సన్మానించి, రూ. 25 లక్షల నజరానాను ప్రకటించారు. ఒక ఇంటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పతకాలు సా«ధిస్తున్న ఓల్గా ఆర్చరీ అకాడమీకి కావల్సిన స్థలం, విదేశీ కోచ్‌ల కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 2024 ఒలింపిక్స్‌లో పతకం సాధించి ఇస్తామని, ఓల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్‌ కోచ్‌ చెరుకూరి సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. టెన్విక్‌ సంస్థ అధినేత అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో మంచి ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. సెయిలింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచిన పి.స్వాతికి రూ.10 లక్షలు నజరానా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శాప్‌ చైర్మన్‌ డాక్టర్‌ అంకమ్మ చౌదరి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్‌ ఎండీ ఎన్‌.బంగారురాజు, శాప్‌ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.   

యువత, విద్యార్థులు సీకే నాయుడును ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జెడ్పీ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన భారత క్రికెట్‌ జట్టు తొలి కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు విగ్రహాన్ని కుంబ్లే ఆవిష్కరిం చారు. పట్టణంలో రూ.13 కోట్లతో నిర్మించనున్న ఇండోర్‌ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. తొలిసారిగా మచిలీపట్నం రావడం, నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.    
–సాక్షి, మచిలీపట్నం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement