క్రికెట్‌ చరిత్రలో తొలి బౌలర్‌గా..

Anderson Becomes First Bowler To Play 150 Test Matches - Sakshi

సెంచూరియన్‌: ఇంగ్లండ్‌ ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ క్రికెట్‌ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఇప్పటివరకూ ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సాధించాడు. ఒక బౌలర్‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగడమే ఒక ఘనతైతే, అందులో ఓ అరుదైన ఘనతను సాధించడం కచ్చితంగా వారికి చిరస్మరణీయంగానే మిగిలిపోతోంది. ఇప్పటివరకూ కేవలం బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే ఉన్న ఆ జాబితాలో తొలిసారి అండర్సన్‌ స్థానం సంపాదించాడు. టెస్టు కెరీర్‌లో 150 అంతకంటే మ్యాచ్‌లు ఆడిన జాబితాలో అండర్సన్‌ చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో ఆరంభమైన తొలి టెస్టు ద్వారా అండర్సన్‌ ఈ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌ను చేరుకున్నాడు. ఫలితంగా 150 టెస్టు మ్యాచ్‌లు ఆడి తొలి బౌలర్‌గా నయా రికార్డును నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు.(ఇక్కడ చదవండి: ఈ దశాబ్దపు ఐదో బౌలర్‌గా ఘనత)

అండర్సన్‌ కంటే ముందు 150, అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(200), రికీ పాంటింగ్‌(168), స్టీవ్‌ వా(168), జాక్వస్‌ కల్లిస్‌(166), శివ నారాయణ్‌ చందర్‌పాల్‌(164), రాహుల్‌ ద్రవిడ్‌(164), అలెస్టర్‌ కుక్‌(161), అలెన్‌ బోర్డర్‌(156)లు ఉన్నారు. అయితే వీరంతా బ్యాట్స్‌మెన్‌లు కాగా, ఇప్పుడు వారి సరసన తొలి బౌలర్‌గా అండర్సన్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ అండర్సన్‌కు 150వది. తన 17 ఏళ్ల కెరీర్‌లో అండర్సన్‌ తరచు గాయాల బారిన పడుతూనే తన రీఎంట్రీలో ఫిట్‌నెస్‌ను ఘనంగా నిరూపించుకుంటూనే ఉన్నాడు.

ఇలా గాయాల బారిన పడుతూ ఒక పేస్‌ బౌలర్‌ నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ అండర్సన్‌ తన ఫిట్‌నెస్‌ విషయంలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 576 వికెట్లను అండర్సన్‌ సాధించి నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున 500కి పైగా టెస్టు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌ కూడా అండర్సన్‌ కావడం విశేషం. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన బౌలర్లలో అండర్సన్‌ తర్వాత స్థానంలో షేన్‌ వార్న్‌ ఉన్నాడు. వార్న్‌ తన కెరీర్‌లో 145 టెస్టులు ఆడాడు. పేసర్ల విభాగంలో అండర్సన్‌ తర్వాత స్థానంలో స్టువర్ట్‌ బ్రాడ్‌(135), వాల్ష్‌(132), కపిల్‌దేవ్‌(131)లు ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top